Gas cylinder:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్ ధరలను మరోసారి పెంచడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.పెంచిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణం తగ్గించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చేదు బహుమతిని ఇచ్చారని వినోద్ కుమార్ విమర్శించారు.అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న తరుణంలో భారత దేశంలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనైతికంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారని వినోద్ కుమార్ ఆరోపించారు
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే సామాన్యులు నడ్డి విరుస్తూ.. ముఖ్యంగా మహిళలపై ఆర్థిక భారం మోపుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచారని, ఇది అత్యంత విచారకరమని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.2014 సంవత్సరంలో 410/- రూపాయలు ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం పెంచిన 50 రూపాయలతో కలిపి 1,155/- కు చేరుకుందని, ఈ ఎనిమిదేళ్ల కాలంలో దాదాపు 745 రూపాయలు ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయని, ఇది సామాన్యుల నడ్డి విరవడమే అని వినోద్ కుమార్ అన్నారు.గృహ అవసరాల సిలిండర్ ధరను రూ. 50, వాణిజ్య అవసరాల సిలిండర్ ధరను రూ. 350 పెంచడం దారుణం అని వినోద్ కుమార్ అన్నారు.గ్యాస్ సిలిండర్ ధరలలో వెంటనే తగ్గించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.