సరికొత్త నిబంధనలు తెచ్చిన కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ
వంట గ్యాస్ సిలిండర్లను కొంతమంది బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై గ్యాస్ సిలిండర్ డెలివరీ కావాలంటే వన్ టైమ్ పాస్ వర్డ్(ఓటీపీ) తప్పనిసరి. ఇండియాలో గ్యాస్ వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అదే సమయంలో బ్లాక్ మార్కెట్కు తరలించే వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
రిజిస్టర్ మొబైల్ కు ఓటీపీ
ప్రస్తుతం వినియోగదారులు ఏజెన్సీ ఫోన్ నెంబర్/ యాప్/ ఆన్ లైన్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటున్నారు. దీని ఆధారంగానే బుక్ చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది. అతి త్వరలో నే ఈ విధానానికి స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీతో కూడిన సందేశం వస్తుంది. సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ కు ఓటీపీ నంబర్ ను చెప్పాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్ తన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ యాప్ లో ఓటీపీ నంబర్ ను ఎంటర్ చేసిన తర్వాతనే సిలిండర్ డెలివరీ చేయడం సాధ్యమవుతుంది.
మొబైల్ నంబర్ రిజిష్టర్ తప్పనిసరి
గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ గ్యాస్ ఏజెన్సీ దగ్గర తమ ఫోన్ మొబైల్ నంబర్ ను తప్పనసరిగా రిజిష్టర్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ రిజిష్టర్ కాకపోతే సిలిండర్ డెలివరీ చేయడం సాధ్యపడదు. మొదటగా ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కానుంది.