Homeహైదరాబాద్#Vehicle #TrafficRules : మీ వాహనం ఎవరికైనా ఇస్తున్నారా.. అయితే అంతే..

#Vehicle #TrafficRules : మీ వాహనం ఎవరికైనా ఇస్తున్నారా.. అయితే అంతే..

  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనివారికి వాహనాలు ఇవ్వకండి
  • ఇచ్చే ముందు జాగ్రత్తలు తప్పనిసరి
  • వాహనం ప్రమాదానికి గురైతే కేసులు తప్పవు
  • నడిపిన వ్యక్తితో పాటు
  • వాహన యజమాని కూడా కటకటాల్లోకి
  • మైనర్లకు ద్విచక్రవాహనాలు ఇవ్వడం నేరమే
  • అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
  • పట్టుబడితే బండి సీజ్‌, తల్లిదండ్రులకు జైలుశిక్ష

గ్రేటర్‌ రహదారులపై ప్రమాదాల నియంత్రణకు పోలీసులు ఓవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రమాదాలు ఎలా? ఎందుకు జరుగుతున్నాయో..? తెలుసుకునేందుకు అధ్యయనం ప్రారంభించారు.

పలు రోడ్డు ప్రమాదాలను పరిశీలించగా విస్తుగొలిపే వాస్తవాలు బయటకొచ్చాయి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా రోడ్డెక్కడమే కాకుండా, ఓవర్‌స్పీడ్‌, ఓవర్‌టేక్‌తో వారు ప్రమాదాల బారినపడడంతోపాటు అవతలి వారు క్షతగాత్రులయ్యేందుకు కారణమవుతున్నట్లు తేలింది.

రోడ్డు నిబంధనలపై అవగాహన లేకపోవడం ఒకటైతే..మరికొందరు ఇతరుల వాహనాలను అడిగి రోడ్లెక్కుతూ ప్రమాదాలకు గురవుతున్నారు.

ఇలాంటి ఘటనల్లో లైసెన్స్‌ లేకుండా బండి నడిపిన వ్యక్తితోపాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదవుతున్నాయి.

లైసెన్స్‌ లేని వ్యక్తులకు వాహనాలు ఇవ్వొద్దని, ఇచ్చి ఇబ్బందులకు గురికావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ముచ్చటపడినా, సరదాకైనా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ బండి అప్పగించొద్దని కోరుతున్నారు.

అర్హత లేకుండా మైనర్లు బండి నడిపి పట్టుబడితే తల్లిదండ్రులకు జైలుశిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.

గ్రేటర్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసు అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

ఆయా కేసులను పరిశీలించిన పోలీసులు.. ప్రమాదాలకు గల కారణాలను గుర్తించారు.

ప్రధానం డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, నిబంధనలపై ఎంత మాత్రం అవగాహన లేని వ్యక్తులు వాహనాలు నడిపించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు.


కొంతమంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు (మైనర్లు) డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే వాహనాలు నడిపించేందుకు అనుమతిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారితోనే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు.. నియంత్రించేందుకు చర్యలు మొదలుపెట్టారు.

ఈ క్రమంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తులకు వాహనాలు ఇస్తున్న యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు.

మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా కేసులు పెడుతున్నారు.

ఎవరైనా ఇతరుకు వాహనాలు ఇచ్చే సమయంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా.. లేదా.. పరిశీలించి ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

యజమానిపై కూడా కేసు..

ఇటీవల కురిసిన వర్షాలకు గండిపేట చెరువు నిండింది.

ఆ అందాలను చూసేందుకు నార్సింగి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ ఓ ఫ్లాట్‌ యజమాని ద్విచక్ర వాహనాన్ని అడిగి తీసుకున్నాడు.

ఆ వాహనంపై ముగ్గురు కలిసి గండిపేటకు బయలుదేరారు.

మంచిరేవుల దగ్గర ఓ మహిళను ఢీకొట్టారు. ప్రమాదంలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆమె కుటుంబ సభ్యులు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసును నమోదు చేశారు.

ప్రమాదంపై దర్యాప్తు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. వాహనం నడిపిస్తున్న వ్యక్తికి లైసెన్స్‌ లేదు.

లైసెన్స్‌ లేని వ్యక్తికి వాహనం ఇవ్వడంతో యజమాని నిర్లక్ష్యం ఉందని పోలీసులు గుర్తించారు.

దీంతో, ఆ కేసులో ప్రమాదం చేసిన వ్యక్తితో పాటు వాహన యజమానిపై కూడా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ అధికారులు ఎంవీ యాక్ట్‌ 180, 181 కింద కేసు నమోదు చేశారు.

ముగ్గురూ తప్పుచేశారు..

జగద్గిరిగుట్ట నవోదయ కాలనీలో సోమవారం రాత్రి ఓ యాక్సిడెంట్‌ జరిగింది.

ఓ ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్‌ అతివేగంగా వచ్చి ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టెక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు.

ఈ సంఘటనను ట్రాఫిక్‌ పోలీసు అధికారులు పరిశీలించారు.

ఇందులో మొత్తం ముగ్గురి నిర్లక్ష్యం ఉందని తేల్చారు.

  1. అంబులెన్స్‌ డ్రైవర్‌ మద్యం సేవించి వాహనాన్ని వేగంగా నడపడం.
  2. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా ఆటో డ్రైవర్‌ ఆటోను నడపడం.
  3. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తికి ఆటోను అద్దెకి ఇవ్వడం యజమాని తప్పుగా గుర్తించారు.

నిర్లక్ష్యం చేస్తే కేసులు తప్పవు..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారికి వాహనాలు ఇచ్చే యజమానులపై కచ్చితంగా ఎంవీ యాక్ట్‌ 180, 181 కింద అభియోగాలను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నమోదు చేస్తున్నారు.

ఈ యాక్ట్‌లో జరిమానా, జైలు శిక్ష కూడా ఉంటుంది.

రోడ్డు ప్రమాదంలో మరణం సంభవిస్తే కచ్చితంగా యజమానిపై కూడా 304 పార్ట్‌- 2 కింద అభియోగం వర్తిస్తుందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇతరులకు వాహనాలు ఇచ్చే సమయంలో.. వాహనం నడిపే వ్యక్తికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా.. లేదా.. పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

నిర్లక్ష్యం చేస్తే యజమాని కూడా కటకటాలు లెక్కించాల్సి వస్తుందంటున్నారు.

మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల పైన కూడా సైబరాబాద్‌ పోలీసులు కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img