Homeఅంతర్జాతీయంGold form trees : చెట్ల నుంచి బంగారం కారుతుంది

Gold form trees : చెట్ల నుంచి బంగారం కారుతుంది


Gold in liquid form trees in spain (Gold form trees) : చెట్ల నుంచి బంగారం కారుతుంది..

పైన్ చెట్ల నుంచి జిగురును వెలికి తీసే(Gold form trees) అలవాటు కొన్ని శతాబ్దాలుగా ఉంది.

ఈ ప్రాచీన అలవాటు భూమికి మేలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలను సంరక్షిస్తుందని స్పెయిన్‌లోని ఓ ప్రావిన్స్ ప్రజలు భావిస్తారు.

స్పెయిన్ వాయువ్య భాగంలో విస్తరించి ఉన్న కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతం పర్వత శ్రేణులు, ఎత్తైన పీఠభూములు, మధ్యయుగం నాటి పట్టణాలతో ఉంటుంది.

ఇక్కడుండే కోటలు, చర్చిల సౌందర్యాన్ని చూసేందుకు చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు.

ఇక్కడుండే ఎత్తైన ప్రాంతాల్లో ఉండే మెసెట మైదానాలు కనుచూపు మేరా విస్తరించి ఉంటాయి.

కానీ, సెగోవియా, అవిలా, వాలాడోలిడ్ ప్రావిన్సులలో మాత్రం పూర్తిగా భిన్నమైన భూభాగం కనిపిస్తుంది.

టియర్రా డి పినారెస్, సియర్రా డి గ్రెడోస్ పర్వత సానువుల మధ్య.. 4,00,000 హెక్టార్ల విస్తీర్ణంలోని పైన్ వృక్షాలతో నిండిన ప్రాంతం పర్వతాల లోపల వరకు చొచ్చుకుని ఉంటుంది.

సూర్య కిరణాలు కూడా చొరబడలేనంత దట్టమైన ఈ అడవులలో హైకింగ్‌కు స్థానికులు, సందర్శకులూ ఇష్టపడతారు.

సరైన సమయంలో ఇక్కడకు వచ్చి నిశితంగా పరిశీలిస్తే, కొన్ని శతాబ్దాల నాటి పురాతన ఆచారాన్ని కొనసాగిస్తున్న కార్మికులు పైన్ చెట్ల నుంచి ‘ద్రవ రూపంలోని బంగారం’ (జిగురు) సేకరిస్తూ కనిపిస్తారు.

వృద్ధి చెందుతున్న మార్కెట్

కొన్ని వేల సంవత్సరాలుగా వివిధ నాగరికతలకు చెందిన వారు పైన్ చెట్ల జిగురును వినియోగిస్తున్నారు.

స్పెయిన్‌లో, మధ్యధరా ప్రాంతాల్లో.. నౌకలను వాటర్ ప్రూఫ్ చేసేందుకు, గాయాలకు చికిత్సగా, కాగడాలు వెలిగించేందుకు దీనిని వాడుతున్నారు.

కానీ కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతంలో పైన్ చెట్ల నుంచి జిగురును సేకరించడం 19, 20వ శతాబ్దాల వరకూ కూడా లాభదాయకం కాలేదని మాడ్రిడ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో ఫారెస్ట్రీ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అలెజాన్డ్రో చోహాస్ చెప్పారు.

19వ శతాబ్దపు మధ్యలో ఈ చెట్ల నుంచి తీసే చిక్కటి జిగురుతో ప్లాస్టిక్, వార్నిష్, టైర్లు, జిగురు, రబ్బరు, టర్పెంటైన్ తయారు చేసేవారు.

పైన్ అడవుల యజమానులు దీనినో అవకాశంగా చూశారు. దాంతో, ఆ ప్రాంతంలో ఉన్న పైన్ చెట్ల నుంచి ఈ విలువైన ద్రవాన్ని సేకరించేందుకు పనివాళ్లను తీసుకొచ్చారు.

జిగురు సేకరించే పని ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఆపేశారు.

కానీ కాస్టిల్లా వై లీయోన్‌లో మాత్రం చెట్ల నుంచి జిగురును సేకరించే పని గత పదేళ్లలో పునరుజ్జీవం పొందింది.

యూరప్‌లో ఎక్కడా లేనంతగా ఈ ప్రాంతంలో రెసిన్ ఉత్పత్తిదారులు ఉన్నారు.

ఇప్పటికీ చెట్ల నుంచి జిగురును సేకరిస్తున్న పనిని కొనసాగిస్తున్న ఆఖరి ప్రాంతం కూడా ఇదే అని చెప్పవచ్చు.

మరణం నుంచి జీవితం వరకూ..

మరియానో గోమెజ్ అవిలా ప్రావిన్సులో జన్మించారు. ఆయన 32 ఏళ్లుగా ఈ పైన్ చెట్ల నుంచి రెసిన్ తీసే పనిలో ఉన్నారు.

“మా నాన్నగారు రెసిన్ ఉత్పత్తిదారులు. నేను ఆయన నుంచే ఈ పని నేర్చుకున్నారు.

మొదట్లో నేను గొడ్డళ్లను వాడేవాడిని. కానీ, వాటి వల్ల నా చేతులు వాచిపోతూ ఉండేవి.

ప్రస్తుతం, మెరుగైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఇంకా చేతులతోనే చేయాల్సి వస్తోంది” అని చెప్పారు.

గోమెజ్‌తో పాటూ ఇతర స్థానికులు కూడా వారి పూర్వీకులు వాడిన గొడ్డళ్లను, ఇతర పరికరాలనూ వారిళ్ళల్లో ఇప్పటికీ గుర్తుగా పెట్టుకున్నారు.

ఈ పరిశ్రమ మొదలైనప్పటి నుంచీ చెట్ల నుంచి రెసిన్ సేకరించే విధానంలో ఎలాంటి మార్పులూ రానప్పటికీ, ఆధునిక ఉత్పత్తిదారులు రెసిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు మాత్రం కొత్తకొత్త పరికరాలను మాత్రం కనిపెట్టారు.

దాంతో, రెసిన్ ఉత్పత్తి, ఉత్పాదకత బాగా పెరిగింది.

గతంలో కొన్ని పాత పద్ధతుల్లో రెసిన్ తీసేందుకు చెట్లను గొడ్డళ్లతో కొట్టే సమయంలో అవి చనిపోతూ ఉండేవి.

కానీ, ఇప్పుడు అతి తక్కువ గాట్లు పెట్టి చెట్టుకు హాని జరగకుండా చూస్తున్నారు.

కన్నీరు కారుస్తున్న చెట్లు

మార్చి నుంచి నవంబరు వరకు స్థానిక ఉత్పత్తిదారులు పైన్ వృక్షాల బెరడును జాగ్రత్తగా తొలగించి రెసిన్ తీస్తారు.

ఆ తర్వాత చెట్టు మొదలుకు ఒక ప్లేటును, రెసిన్ సేకరించేందుకు ఒక కుండను తగిలిస్తారు.

ఆ తర్వాత బెరడుకు గాట్లు పెడతారు. దాంతో, చెట్ల నుంచి వచ్చే రెసిన్ ఆ కుండల్లోకి చేరుతుంది.

కుండలు నిండిన తర్వాత దానిని 200 కేజీల కంటైనర్లలోకి వంపుతారు.

ఈ కంటైనర్లను ఫ్యాక్టరీలకు పంపి డిస్టిలేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. అందులో ఉండే టర్పెంటైన్‌ను వెలికి తీస్తారు.

టర్పెంటైన్‌ను తొలగించిన తర్వాత ఇది పసుపు రంగులోకి మారి గట్టిగా మారిపోతుంది.

అప్పుడిది మెరిసే పసుపు వర్ణంలో ఉండే రాళ్ళలా తయారవుతుంది.

1961లో స్పెయిన్‌లో రెసిన్ సేకరణ అత్యధిక స్థాయిలో ఉన్న సమయంలో ( 55,267 టన్నుల రెసిన్‌ను వెలికితీసినప్పుడు) అందులో 90 శాతం కాస్టిల్లా వై లీయోన్ అడవుల నుంచే ఉత్పత్తి అయింది.

అప్పటి నుంచీ దీనికి డిమాండ్, ధరలు కూడా తగ్గిపోవడంతో క్రమేపీ ఉత్పత్తి తగ్గు ముఖం పట్టింది.

1990లలో అయితే రెసిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు.

దాంతో, చాలా మందికి ఈ స్పానిష్ ఆచారం అంతరించిపోతుందేమోననే అనుకున్నారు.

కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతంలో గ్రామీణ ప్రజలకు రెసిన్ అనేది కేవలం ఆర్థిక జీవనాడి మాత్రమే కాదు.

ఇది కొన్ని తరాల నుంచీ వారసత్వంగా వచ్చిన వ్యాపారం.

ఇక్కడ కుటుంబాలతో మాట్లాడి చూస్తే, ప్రతీ కుటుంబంలో కనీసం ఒకరైనా చెట్లను కొట్టడం కానీ, లేదా డిస్టిలేషన్ ప్రక్రియలో కానీ పని చేసిన వారు ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ ప్రాంతాల్లో ఆర్థిక సామాజిక కార్యకలాపాలు రెసిన్ పరిశ్రమతోనే ముడిపడి ఉంటాయి.

ఇక్కడి ప్రజలు దీనిని వారి సంస్కృతిలో భాగంగా చూస్తారు.

ఇంధనానికి పర్యావరణ ప్రత్యామ్నాయమా?

ప్రస్తుతం భూమి నుంచి ఇంధనాన్ని వెలికి తీస్తున్న స్థాయిని గమనిస్తే, 2050 నాటికి ఇంధన వనరులు పూర్తిగా అడుగంటుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

“కానీ, దీనికి రెసిన్ ప్రత్యామ్నాయం గా పని చేస్తుంది” అని మాడ్రిడ్ అటానమస్ యూనివర్సిటీలో లా ప్రొఫెసర్, పర్యావరణ విధానాల నిపుణుడు బ్లాంకా రోడ్రిగ్వెజ్- చావెజ్ చెబుతున్నారు.

ప్లాస్టిక్ లాంటి చాలా పదార్థాలు బయో డిగ్రేడబుల్ కావు.

అలాంటి వాటిని రెసిన్‌తో తయారు చేయడం వల్ల వాటిని సులభంగా భూమిలోకి ఇంకేలా చేయవచ్చని చెప్పారు.

“రెసిన్ నేడు ప్రపంచానికి పెట్రోలియంలా పని చేస్తోంది. భవిష్యత్తులో కూడా ఇదే పని చేస్తుంది.

పెట్రోల్ వాడి చేసే పనులన్నిటినీ రెసిన్ తో చేయవచ్చు” అని ఆమె చెప్పారు.

ఇప్పటికే రెసిన్‌తో ప్లాస్టిక్ తయారు చేస్తున్నారు. దీనిని సౌందర్య ఉత్పత్తులు, ఔషధ పరిశ్రమలోనూ వాడుతున్నారు.

పునరుత్పాదక వనరులను, శక్తిని అడవులు సహజంగా సరఫరా చేస్తాయి.

వీటితో మనం పెట్రోల్ తో వాడే ఉత్పత్తులకు బదులుగా వాడవచ్చు. ఇక్కడే రెసిన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ప్రపంచంలో స్పానిష్ రెసిన్ స్వచ్ఛమైనది. యూరోప్‌లో పోర్చుగల్, స్పెయిన్ మాత్రమే రెసిన్ ఉత్పత్తి చేస్తున్నాయి.

గ్రామీణులకు లాభం

రెసిన్ పరిశ్రమతో పర్యావరణ ప్రయోజనాలే కాకుండా స్పెయిన్ గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను కూడా ఈ రంగం నిరోధించగలదని చెబుతున్నారు.

స్పెయిన్ లో యువత మెరుగైన ఉద్యోగావకాశాల కోసం గ్రామీణ ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండటంతో 42 శాతం ప్రాంతాలలో జనాభా తగ్గుదల కనిపిస్తోందని బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ విడుదల చేసిన నివేదిక చెబుతోంది.

ఈ పరిస్థితి కాస్టిల్లా వై లీయోన్ లో మరింత ఎక్కువగా ఉంది.

అయితే, పైన్ రెసిన్ పట్ల కొత్తగా కలిగిన ఆసక్తి వల్ల కొంత మంది యువత పని కోసం తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నారు.

అలా వచ్చిన వారిలో గిలెర్మో అరాన్జ్ ఒకరు.

రెసిన్ పని చేస్తున్న వారిలో కుటుంబంలో ఆయన నాలుగో తరానికి చెందిన వారు.

“ఈ పైన్ చెట్ల అడవే నా ఆఫీసు. నేను పుట్టిన చోటే పని చేసే అవకాశాన్ని నాకీ అడవి ఇచ్చింది.

ఈ ఉద్యోగం నాకు ఒక యజమాని లేకుండా పని చేసే స్వేచ్ఛను ప్రసాదించింది.

నా వాళ్ళతో, ప్రకృతితో నేరుగా గడపగలిగే అవకాశాన్ని ఇచ్చింది” అని చెప్పారు.

నా రాజ్యం

విసెంట్ రోడ్రిగ్వెజ్ కూడా అరాన్జ్ ఆలోచనలతో ఏకీభవిస్తున్నారు.

“ఇక్కడ చాలా కొద్దిమందిమే మిగిలాం. మేం ఇప్పటికీ పైన్ చెట్ల నుంచి రెసిన్ సేకరించడాన్ని (Gold form trees) చూసి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు.

మమ్మల్ని పాత కాలం వాళ్ళని చూసినట్లు చూస్తారు. కానీ, ఈ ప్రాంతాల భవిష్యత్తు అంతా రెసిన్ తో ముడిపడి ఉందని వారికి అర్థం కాదు.

నేను ఈ కొండల్లోకి వచ్చి నా మూలాలతో కలిశాను. ఇది నాకిష్టం” అని అన్నారు.

ఇసాబెల్ జిమినెజ్ ఇక్కడ రెసిన్ తీసే అతి కొద్ది మంది మహిళల్లో ఒకరు.

ఈ పని చేయడం శ్రమతో కూడుకున్నది కావడం వల్ల మహిళలు సహాయ పనులకు మాత్రమే పరిమితమయ్యేవారు.

“నేను రెసిన్ వెలికి తీసే కొత్తలో నా మీద మగవాళ్ళు జోకులు వేయడం నాకింకా గుర్తుంది.

నేనిక్కడ ఎన్ని వారాలు ఉండగలనని పందేలు కూడా వేసుకున్నారు. మూడేళ్ళ తర్వాత కూడా నేనిక్కడే ఉన్నాను.

నేను శారీరకంగా దృఢంగా ఉంటాను. ఇది నాకు జీవనాధారం, ఆదాయాన్ని మాత్రం ఇవ్వడమే కాదు.

ఇది నా రాజ్యం కూడా. ఈ భూమి మీద నాకంటూ ఉన్న చిన్న స్థలం ఇది” అని అన్నారు.

పనిలో స్వాతంత్య్రం

ప్రస్తుతం స్పెయిన్‌లో 90 శాతం రెసిన్ సేకరణ కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతంలోనే జరుగుతోంది.

ఈ పురాతన అడవులను కాపాడాలంటే, పైన్ చెట్ల ఉత్పత్తిదారులకే నియంత్రణ ఎక్కువగా ఇవ్వాలని ఆరాన్జ్ , రోడ్రిగ్వెజ్ భావిస్తున్నారు.

“రెసిన్ ఉత్పత్తిదారులను వారి సొంత భూభాగాన్ని నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలి.

ఈ కొండలను పర్యవేక్షించి, శుభ్రం చేసేందుకు ప్రభుత్వం మాకు సహాయం చేస్తే, మేం సంవత్సరమంతా పని చేస్తాం.

దాంతో, మరింత మంది ఇక్కడ పని చేసేందుకు వస్తారు” అని రోడ్రిగ్వెజ్ చెప్పారు.

ఈ గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు యువతను ఆకర్షిస్తే, పర్యటక సంస్థలు ఫారెస్ట్ వాక్స్, స్థానిక మ్యూజియం లలో రెసిన్ వర్క్ షాప్ లు లాంటివి నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతంలో ఇకో టూరిజమ్ అభివృద్ధి జరిగే అవకాశం ఉందని రోడ్రిగ్వెజ్ అంటారు.

రెసిన్ పర్యటకం (Gold form trees)

ఈ ఆలోచన కార్యరూపం దాల్చే దిశలో, రెసిన్ (Gold form trees) పుష్కలంగా ఉన్న తీతర్ లోయ (అవిలా ) యునెస్కో సంరక్షక బయో స్పియర్ రిజర్వ్ గా గుర్తించేందుకు దరఖాస్తు చేశారు.

రెసిన్ కు అంకితమైన కాసిల్లాస్ మ్యూజియం, నావా డి ఓరో మ్యూజియం, ఓనా మ్యూజియం లాంటి మ్యూజియంలు ఇక్కడ చాలా ఉన్నాయి.

ఇక్కడకు విచ్చేసే సందర్శకులు రెసిన్ కార్మికులు విశ్రమించే సంప్రదాయ హీథర్ హట్స్‌తో పాటూ రెసిన్ తీసేందుకు ఉపయోగించిన సంప్రదాయ పరికరాలు చూడవచ్చు.

స్థానిక మ్యూజియంల నుంచి అడవిలోకి తీసుకుని వెళ్లేందుకు ‘రెసిన్ రూట్’ టూర్లను అందించే సంస్థలు కూడా ఉన్నాయి.

వారాంతాల్లో , నగరాల హడావిడిని తప్పించుకుని హైకింగ్ కోసం వచ్చే వారి బూట్ల చప్పుళ్లు ఈ పచ్చని అడవుల్లో వినిపిస్తాయి.

కానీ, జాగ్రత్తగా వింటే.. చెట్ల మొదళ్లకు కట్టిన కుండలోకి చుక్క చుక్కగా జారుతున్న స్పెయిన్ లిక్విడ్ గోల్డ్ శబ్దాన్ని కూడా వినవచ్చు.

Recent

- Advertisment -spot_img