Gold price in pakistan:నింగిని అంటుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ప్రభుత్వ నిస్సహాయత మరోవైపు పాకిస్థాన్‌ను మరింత దివాళా దిశగా నడిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేనంతగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న పాకిస్థాన్ లో ఏ వస్తువును కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. నింగిని అంటుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ప్రభుత్వ నిస్సహాయత మరోవైపు పాకిస్థాన్‌ను మరింత దివాళా దిశగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లో బంగారం ధరలు పట్టుకుంటే భగ్గుమనేలా ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశంలో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2.06 లక్షలు (పాకిస్థాన్ కరెన్సీలో) ఉందంటే పాక్ పరిస్థితి ఎంత దిగజారిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అమెరికా డాలర్‌తో పోల్చితే పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం డాలర్‌తో పాక్ రూపాయి మారకం విలువ రూ.280కి పైన ట్రేడవుతోంది. పాకిస్థాన్ నెలవారీ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి మాసంలో 31.6 శాతం పెరిగిపోగా.. పాకిస్థాన్ రిజర్వ్ బ్యాంకు 300 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచేసింది. మరోవైపు దేశం దివాళా కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధితో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో పన్నులు బాగా పెంచేయగా, ధరలు కూడా ఆకాశాన్నంటేలా పెరిగిపోయాయి. ఫలితంగానే పాకిస్థాన్‌లో పాల ధర లీటరుకు ఏకంగా 210 రూపాయలకు చేరింది.
చికెన్ రేటు కేజీకి రూ. 700 నుంచి రూ. 780
చికెన్ రేటు విషయానికి వస్తే.. కేజీకి రూ. 700 నుంచి రూ. 780 వరకు ఉంది. అంతేకాకుండా అక్కడ పెట్రోల్ రేటు కూడా రూ. 300కు దాటిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు విదేశీ మారకద్రవ్యం తగినంతగా లేకపోవడంతో విదేశీ దిగుమతులు అంతంతమాత్రంగా ఉన్నాయి. మరి రానున్న కాలంలో పాక్ పరిస్థితి మరింతగా దిగజారుతుందో లేక గాడిన పడుతుందో వేచి చూడాలి. ఇలా ధరల పెరుగుదల వల్ల ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు.