Homeహైదరాబాద్latest NewsBJP కి ఈటల గుడ్ బై.. ఆ పార్టీ లోకి జంప్?

BJP కి ఈటల గుడ్ బై.. ఆ పార్టీ లోకి జంప్?

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఈటల రాజేందర్ మళ్లీ సొంతగూటికి వెళ్లబోతున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారా? ప్రస్తుతం బీజేపీ నుంచి ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఘర్ వాపసీ కాబోతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈటల రాజేందర్ త్వరలో బీఆర్ఎస్ గూటికి వెళ్లబోతున్నట్టు పొలిటికల్ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు గులాబీ పార్టీ పెద్దల నుంచి కూడా సానుకూల సంకేతాయాలు వచ్చాయట. అంతా అనుకున్నట్టు జరిగితే ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ లేదా మల్కాజిగిరి స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే చాన్స్ ఉంది.

ఇంటర్వ్యూల్లో హాట్ కామెంట్స్
ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓ రాజకీయపార్టీలో టాప్ పొజిషన్ లో ఉన్న లీడర్ మరో పార్టీలోకి వెళితే.. అక్కడ ఆశించిన స్థాయిలో గౌరవం దక్కదు’ అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఆయన బీజేపీలో పెద్దగా సంతృప్తిగా లేరని అర్థమవుతున్నది. నిజానికి ఈటల రాజేందర్ వ్యక్తిగత సిద్ధాంతాలకు.. బీజేపీ సిద్ధాంతాలకు ఎక్కడా పొసగదు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీతో విబేధించి ఆయన గత్యంతరం లేని పరిస్థితిల్లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి బీజేపీలో ఆయన సౌకర్యవంతంగా లేరు. ముఖ్యంగా బీజేపీలోని ఓ మెజార్టీ వర్గం ఈటలను అస్సలు సహించలేకపోతున్నది. దీంతో ఈటల కూడా ఇబ్బందులు పడుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీలోకే ఎందుకు?
తనకు బీఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం లేదని.. అందుకే బీజేపీలో చేరినట్టు ఈటల ప్రకటించారు. తనను పార్టీ నుంచి అవమానకరంగా బయటకు పంపించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగువెలుగిన ఈటల రాజేందర్ బీజేపీలో ఆ స్థాయిలో పట్టు సాధించలేపోయారు. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడంతో పార్టీలో ఆయన ప్రభ మరింత పలుచన అయ్యింది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటే ఏ స్థానం నుంచి టికెట్ దక్కే అవకాశం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే అక్కడ కూడా విలువు ఉంటుందని ఆశించే పరిస్థితి లేదు. ఆ పార్టీలో ఇప్పుడు చేరడం రాంగ్ టైమింగ్ అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉద్దండ పిండాలైన లీడర్లు ఉన్నారు. వారిని కాదని ఈటలకు ప్రాముఖ్యత దక్కదు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల్లోనూ చేరాడన్న అపవాదు మూటగట్టుకోవలిసి వస్తుంది. అందుకే ఈటల సొంతగూటినే ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

గులాబీ పెద్దల సానుకూలత
ఈటల రాజేందర్ రాకను బీఆర్ఎస్ పెద్దలు సైతం స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మట్లాడుతూ.. ఈటల రాజేందర్ ను తన సోదరుడని వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా ఈటల తమవాడేనంటూ కామెంట్ చేశారు. అప్పట్లోనే ఈటల రాజేందర్ గులాబీ గూటికి చేరిపోతున్నారన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పలువురు పాత ఉద్యమకారులు మళ్లీ గులాబీ గూటికి చేరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీని మళ్లీ గ్రామసీమల్లో బలోపేతం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఈటల లాంటి బలమైన లీడర్లు అవసరం. ఈటలకు కూడా బీఆర్ఎస్ పార్టీయే సరైన వేదిక. అందుకే ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే తిరిగి చేరబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి, మెదక్ ఎంపీ స్థానాల్లో బలమైన అభ్యర్థులు లేరు. అందుకే ఈటలను ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేజారుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈటల రాక తమకు బలం ఇస్తుందని గులాబీ లీడర్లు భావిస్తున్నారట. మరి ఈటల నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరతారా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img