భారతీయ రైల్వే శాఖ రైల్వే ప్రయాణీకుల కోసం కొత్త శకానికి నాంది పలికారు. భారతదేశంలో ప్రయాణీకుల ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించడానికి అనేక కొత్త సౌకర్యాలను తీసుకువస్తోంది. అందులో భాగంగా వందలాది రైళ్లలో జనరల్ క్లాస్ కోచ్ లను పెంచుతూ రైల్వేశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ కోచ్‌లలో సీట్ల కొరతను తగ్గించేందుకు రైల్వే శాఖ కొత్త కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్తగా 370 జనరల్ బోగీలను నిర్మించనున్నారు. నవంబర్ నెలలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని రైల్వే బోర్డు చెప్పిన సంగతి తెలిసిందే. అదే సమయంలో వచ్చే రెండేళ్లలో 10000 నాన్-ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. బోగీల సంఖ్య పెరగడం వల్ల రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తున్న ప్రయాణికులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్న దిగులు లేకుండా వెయిటింగ్ నుంచి టికెట్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంది.రైళ్లలో 4000 స్లీపర్ కోచ్‌ల సంఖ్య పెరగడంతో ఇకపై రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి టికెట్ కచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందని భావిస్తున్నారు.