2025 సంవత్సరంలో దర్శనం కోసం ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. 2025 జనవరి నెల కోటా స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను అక్టోబర్ 19 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 21 ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ టిక్కెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నాం 12 గంటలలోపు చెల్లిస్తే లక్కీడిప్‌లో టిక్కెట్లు కేటాయిస్తారు. అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవల కోసం జనవరి కోటాను మరియు వాటి వీక్షణ స్లాట్‌లను అక్టోబర్ 22 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తుంది. జనవరి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టిక్కెట్ల ఆన్‌లైన్ కోటాను అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.తిరుమల శ్రీవారిని వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబర్ 23 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టిటిడి విడుదల చేయనుంది.