కొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్న వేళ మహారాష్ట్రలో ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ- షిండే శివసేన- అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని కూటమి తాజాగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తమ ప్రభుత్వం అందించనున్న పథకాలను వివరించారు.
ఇందులో భాగంగా 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేసేందుకు మహారాష్ట్ర సర్కార్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. “ముఖ్యమంత్రి మాఝీ లడకీ బహిన్ యోజన” పేరుతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఆర్థిక మంత్రి అజిత్ పవార్ స్పష్టం చేశారు. జులై నెల నుంచే అర్హులైన మహిళల ఖాతాల్లో నెల నెలా రూ.1500 జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.46 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన కింద ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఈ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు