ఇదే నిజం, తెలంగాణ: లోక్సభ ఎన్నికల వేళ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు రైతు భరోసా, పంట సాయం నిధులను సోమవారం విడుదల చేసింది. రైతు భరోసా డబ్బును రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. రూ.2వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. 5 ఎకరాలు లోపు భూమి ఉన్న రైతులకు ఇప్పటికే నిధులు విడుదలయ్యాయి.
తాజాగా ఐదు ఎకరాలు పైబడిన వారికి చెల్లింపులు ప్రారంభించారు. మరోవైపు అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం కింద నిధులను రిలీజ్ చేసింది. పంట నష్టం నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టం జరగగా.. 15,246 మంది రైతులకు రూ. 15.81 కోట్ల నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది.