– కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో చేరేందుకు రెడీ
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ)కి గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం ఎల్‌ఎస్‌జీకి మెంటార్‌గా ఉన్న గంభీర్ ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడు తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)లో చేరనున్నాడు. ఈ విషయాన్ని గంభీర్ అధికారికంగా ప్రకటించాడు. కేకేఆర్‌కు కొన్నాళ్లు నాయకత్వం వహించిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. కొన్నాళ్లపాటు అదే జట్టుకు మెంటార్‌గా పనిచేశాడు. రెండేళ్ల కిందట కేకేఆర్‌ని వదిలి కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా నియమితుడయ్యాడు. ఇప్పుడు తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గంభీర్ మార్గనిర్దేశంలో లక్నో 2022లో ఫైనల్‌కు చేరగా.. 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఎల్‌ఎస్‌జీని వీడటంపై గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. ‘లక్నో సూపర్ జెయింట్స్‌తో నా అద్భుతమైన ప్రయాణం ముగిసిందని ప్రకటిస్తున్నా. ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నాకు మద్దతుగా నిలిచిన ఫ్రాంచైజ్ యజమాని డా.సంజీవ్ గోయెంకాకు ధన్యవాదాలు. జట్టు భవిష్యత్తులో అద్భుతాలు చేస్తుందని, ప్రతి ఎల్‌ఎస్‌జీ అభిమానిని గర్వించేలా చేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఎల్‌ఎస్‌జీ బ్రిగేడ్!’అని గంభీర్ ట్విట్టర్లో పోస్టు చేశాడు.