Got Heavy profits with Joint farming : ఉమ్మడి వ్యవసాయం చేశారు.. 12 ఎకరాలను 120 ఎకరాలు చేశారు..
ఒక్కొక్కరికీ నాలుగు చొప్పున నాన్న పంచిన 12 ఎకరాల్లో ముగ్గురన్నదమ్ములూ ఉమ్మడిగా వ్యవసాయం( Joint farming ) చేశారు.
ప్రకృతి వైపరీత్యాలను, మార్కెట్ ఒడుదొడుకులను జయించారు.
మంచి లాభాలు ఆర్జిస్తూ ఇప్పుడా పొలాన్ని 120 ఎకరాలకు పెంచారు…
నాలుగే పంటలతో అధిక దిగుబడులు సాధిస్తూ.. ఖర్చులు పోను ఏడాదికి రూ.2.5 కోట్లు ఆర్జిస్తున్నారు.
పంటలు నష్టపోకుండా తోటి అన్నదాతలకు సలహాలిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు..
వారే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వామిరంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి..
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు స్వామిరంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి.
నాన్న పంచి ఇచ్చిన 12 ఎకరాల్లో.. ముగ్గురన్నదమ్ములూ 1995లో ఉమ్మడి వ్యవసాయం ప్రారంభించారు.
రాజశేఖర్‌రెడ్డి చదువుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
బడివేళలు ముగియగానే వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారు.
తన సోదరులకు ఆధునిక పరిజ్ఞానం అందిస్తారు…
దిగుబడి మొదలు ఉత్పత్తిని మార్కెట్‌లో విక్రయించే దాకా ముగ్గురూ కలిసి.. అన్నీ ప్రణాళికాబద్ధంగా చేస్తారు.
దానిమ్మ, ద్రాక్ష, మునగ, బత్తాయి సాగు చేస్తూ ఏటా రూ.2.5 కోట్ల ఆదాయం పొందుతున్నారు.
కుటుంబ ఖర్చులు పోగా, మిగిలిన సొమ్ముతో సాగు భూములు కొనుగోలు చేస్తున్నారు.
మంచి లాభాలు ఆర్జిస్తూ ఉన్న 12 ఏకరాల పొలాన్ని 120 ఎకరాలకు పెంచారు , పంటలు నష్టపోకుండా తోటి అన్నదాతలకు సలహాలిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రతి నీటి బొట్టూ బంగారంతో సమానమని..
ప్రతి నీటి బొట్టూ బంగారంతో సమానమని గుర్తెరిగారు ఈ అన్నదమ్ములు.
తమ వ్యవసాయ క్షేత్రంలో ఆరు ఎకరాల్లో 12 కోట్ల లీటర్ల సామర్థ్యంతో నీటి కుంటను ఏర్పాటు చేశారు.
ఏడు కిలోమీటర్ల దూరంలోని పెన్నానది నుంచి ప్రత్యేకంగా పైపులైను వేసి, కుంటను నిత్యం నిండుకుండలా ఉంచుతున్నారు.
దీనికి అనుబంధంగా వ్యవసాయ క్షేత్రంలో అరెకరా విస్తీర్ణం చొప్పున మరో రెండు చోట్ల 50 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసి డ్రిప్ పైపుల ద్వారా మొక్కలకు అందిస్తున్నారు.
వాతావరణ మార్పులపై రాజశేఖర్‌రెడ్డి ఎప్పటికప్పుడు తన సోదరులను అప్రమత్తం చేస్తుంటారు.
స్వామిరంగారెడ్డి, రామకృష్ణారెడ్డి కూలీలతో కలిసి పంటలకు రక్షణ చర్యలు తీసుకుంటారు.
అందువల్లే వీరి తోటల్లోకి చీడపీడలు రావని ధీమాగా చెబుతుంటారు.
నాణ్యమైన పురుగు మందులు, ఎరువులు, డ్రిప్ పరికరాలు ఎక్కడ చౌకగా లభిస్తాయో విచారిస్తారు.
అంతర్జాలంలో శోధించి సరసమైన ధరకు కొనుగోలు చేస్తారు.
మార్కెట్ విషయానికొస్తే…. దిగుబడి మొదలయ్యే రెండు నెలల ముందు నుంచే దేశంలో ఆయా ఉత్పత్తుల ధరల తీరుతెన్నులను లోతుగా పరిశీలిస్తారు.
ప్రస్తుతం మునగ దిగుబడి వస్తోంది. దీన్ని బెంగళూరు, చెన్నై తదితర మార్కెట్లలో ఎక్కడ ధర ఎక్కువ లభిస్తే అక్కడికి పంపుతున్నారు.
పొరుగు రాష్ట్రాల వ్యాపారులు.. వీరి నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్ ధర కంటే కొంత అధికంగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు.
అనవసర మందులు, ఎరువుల వాడకాన్ని కట్టడి చేసినట్లుగానే, కూలీల అవసరాన్నీ పరిమితం చేసుకోవటం వీరి ప్రత్యేకత.
కలుపు తీయటం మొదలు, మందు, ఎరువులు వేయటం వరకు పూర్తిస్థాయిలో యంత్రాలను వినియోగిస్తున్నారు.
తమ తోటలకు వచ్చే కూలీల సంక్షేమానికీ ఈ రైతు సోదరులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
వ్యవసాయ క్షేత్రంలోనే ఆరు కుటుంబాలకు ఇళ్లు నిర్మించారు.