Governer:రాజ్‌భవన్‌ను కావాలనే అవమానిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి ఫైర్ అయ్యారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్ తీరును తప్పుపట్టారు గవర్నర్. తన నియామకానికి ముందు పరేడ్ గ్రౌండ్‌లో ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారని, తాను వచ్చాక పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహిస్తున్నారని అన్నారు. రాజ్‌భవన్‌ను కావాలనే అవమాన పరిచారని ఆరోపించారు గవర్నర్ తమిళిసై. తాను ఎక్కడా రాజకీయాలు చేయడం లేదన్నారు. ఏ ఒక్క పార్టీతో సమావేశం కాలేదని, ఏ పార్టీ నేతలు వచ్చినా గవర్నర్‌గానే కలిశానని పేర్కొన్నారు. తాను బీజేపీకి అనుబంధంగా ఉంటానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు గవర్నర్ తమిళిసై. రిపబ్లిక్ డే ఉత్సవాలలో అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టానని అన్నారు
ఇదే సమయంలో బిల్లుల ఆమోదంలో ఆలస్యంపై ప్రశ్నించగా.. బిల్లులు ఆమోదించడానికి సమయం కావాలన్నారు. 5 నెలల నుంచి బిల్లలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని పరిశీలించాలి కాబట్టి ఇంకా ఆమోదించలేదని వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. రెండేళ్ల నుంచి ప్రొటోకాల్ పాటించడంలేదని, గవర్నర్ గా తనను గౌరవించడం లేదన్నారు.
జిల్లాల పర్యటనలో కలెక్టర్, ఎస్పీని కూడా రానివ్వడంలేదని, బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు గవర్నర్ తమిళిసై. ఆ పార్టీ నేత కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ మనోగతాన్ని ఆవిష్కరించాయన్నారు. మహిళా గవర్నర్‌ను కాబట్టే పదే పదే తనను బీఆర్‌ఎస్ టార్గెట్ చేస్తోందన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కేసీఆర్ ఆమోదిస్తున్నారా? అని ప్రశ్నించారు గవర్నర్. సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి చాలా సార్లు ప్రయత్నించానన్నార. రాజ్‌భవన్ కు ఆహ్వానించినా.. ఆయన రాలేదన్నారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్‌తో, ప్రభుత్వంతో పనిచేయాలనుకున్నానని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్.. రాజ్యాంగాన్ని, కోర్టులను ఏమాత్రం గౌరవించడం లేదని ఆరోపించారు గవర్నర్ తమళిసై.