Government approved request who want to change their gender : పురుషుడిగా మారాలనుకున్న మహిళా కానిస్టేబుల్‌కు ప్రభుత్వ అనుమతి
లింగ మార్పిడి ద్వారా పురుషుడిగా మారాలనుకున్న ఓ మహిళా కానిస్టేబుల్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
చిన్నప్పటి నుంచి తనలో పురుష లక్షణాలు ఉన్నాయని, కాబట్టి పురుషుడిగా మారేందుకు అనుమతి ఇవ్వాలంటూ సదరు మహిళా కానిస్టేబుల్ 2019లో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
దీంతోపాటు అఫిడవిట్ కూడా జతచేశారు. పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు ఆమె దరఖాస్తును హోంశాఖకు పంపించారు.
మరోవైపు, కానిస్టేబుల్‌లో చిన్నతనం నుంచి పురుష లక్షణాలు ఉన్నట్టు సైకాలజిస్టులు కూడా నిర్ధారించారు.
దీంతో ఆమె పురుషుడిగా మారేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్టు హోంశాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ రాజోరా తెలిపారు.
నిబంధనల ప్రకారం భారత పౌరులు తమ కులం, మతానికి సంబంధం లేకుండా లింగమార్పిడి చేయించుకోవచ్చని, నిబంధనలకు లోబడే అనుమతులు ఇచ్చినట్టు రాజేశ్ తెలిపారు.
కాగా, మహిళ నుంచి పురుషుడిగా మారేందుకు ప్రభుత్వం అనుమతించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.