Homeహైదరాబాద్latest NewsKarimnagar : డ్రైనేజీ సమస్య..పట్టించుకోని ప్రభుత్వం

Karimnagar : డ్రైనేజీ సమస్య..పట్టించుకోని ప్రభుత్వం

ఇదే నిజం , మెట్ పల్లి రూరల్ : మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామ పంచాయితీలో మురికి కాలువల పరిస్థితి అధ్వానంగా తయారయింది. మేజర్ గ్రామ పంచాయితీగా మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్నా ప్రధాన మురికి కాలువ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. దశాబ్దాల కింద నిర్మించిన డ్రైనేజీలను పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా రీడిజైన్ చేయడం లేదు. ఆధునీకరణకు నోచుకోక సమస్య మరింత తీవ్రమవుతోంది.

రోజురోజుకు గృహ సముదాయాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా పంచాయతీలో వసతులు సమకూరడం లేదు. గ్రామంలో SRSP కాలువ మొదలుకొని గండి హనుమాన్ వరకు దాదాపు కిలోమీటర్ మేర మురికి కాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది. అంతేకాకుండా గ్రామానికి వెళ్లే మార్గంలో ఒక వాహనం వస్తే ఎదురుగా మరొక వాహనం దాటుకుని వెళ్లాలంటే నల్లేరు మీద నడకలాగ పరిస్థితులు అద్దం పడుతున్నాయి.

రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురికి కాలువలు రోడ్డుకు దిగువగా ఉండడంతో వాహనాలు సైతం ఈ కాలువల్లోకి దిగబడుతున్నాయి. తమ గ్రామంలో పాలకులు మారినప్పటికీ మురికి కాలువల పరిస్థితి చక్కబెట్టిన వారు లేరని గ్రామస్తులు వాపోతున్నారు. వెల్లుల్ల గ్రామం నుంచి నాయకులు మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా పనిచేసినప్పటికీ గ్రామ అభివృద్ధిలో మాత్రం పురోగతి లేదని వాపోయారు.

గ్రామంలోని పలు కాలనీల నుంచి వెలువడే వ్యర్ధాలు నేరుగా ఎస్సారెస్పీ కాలువలో కలుస్తున్నాయి. ఈ మురికి కాలువలను సైతం పల్లె ప్రకృతి వనం మీదుగా తరలించడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నీటి కాలుష్యం అధికమవుతోంది.

దిగువ గ్రామాలు పెద్దాపూర్, కోనరావుపేట తో పాటు చాలా గ్రామాలు తాగు, సాగు నీటి కోసం ఈ జలాలను వినియోగిస్తారు. కలుషిత నీరు వల్ల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటారని తెలిసినప్పటికీ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులు సైతం పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఉన్న కాలువలను పునర్నిర్మించాలని, లేని చోట కొత్తగా నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీలను చేపట్టినట్లయితే ఎలాంటి సమస్యా ఉండదని మరికొందరు అంటున్నారు. ఇకనైనా అధికారులు చొరవ చూపి మురికి కాలువను ఎస్సారెస్పీ కాలువలో కలవకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Recent

- Advertisment -spot_img