Government schools : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల క్రమశిక్షణ, మరియు విద్యా నాణ్యతకు సంబంధించి పలు ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, ఈ విషయంలో ఉపాధ్యాయులు కచ్చితమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. ఒకవేళ విద్యార్థి మూడు రోజులకు మించి గైర్హాజరైతే, ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, గైర్హాజరీకి కారణాలను తెలుసుకోవాలని సూచించారు. అయిదు రోజుల తర్వాత కూడా విద్యార్థి పాఠశాలకు హాజరు కాకపోతే, ఉపాధ్యాయులు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. పదవ తరగతిలో తక్కువ మార్కులు సాధించే విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే “తల్లికి వందనం” పథకం కింద 75% విద్యార్థులు అర్హత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు పాఠశాలకు హాజరు కావాలని, ఈ విషయంలో ఎలాంటి రాయితీ ఇవ్వబడదని విజయరామరాజు స్పష్టం చేశారు. ఒక ఉపాధ్యాయుడు సెలవు తీసుకుంటే, వారి స్థానంలో వెంటనే మరొక ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. అలాగే, డీఈఓలు, ఎంఈఓలు, సీఆర్‌పీలు, ఏపీసీలు తరచూ పాఠశాలలను సందర్శించి, హాజరు మరియు విద్యాప్రమాణాలను పరిశీలించాలని సూచించారు. కొంతమంది ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు విజయరామరాజు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం అందించే ఐచ్ఛిక సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని, పాఠశాల మొత్తానికి కాదని స్పష్టం చేశారు.