ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్, ఎంపీ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి పార్లమెంట్ ఎంపీగా గెలుపొంది మొదటిసారి ధర్మపురికి వచ్చిన గడ్డం వంశీ కృష్ణ కి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి, స్వామి వారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 75వ ఇందిరా వన మహోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ తో కలిసి ధర్మపురిలోని స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం లో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని, ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా 46 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించడం జరిగిందని, ప్రజలు కోరుకున్న విధంగానే పూలు, పండ్ల మొక్కలనే పంపిణీ చేయడం జరుగుతుందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని వాటిని పర్యవేక్షించలసిన బాధ్యత అధికారులు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.