ఇదే నిజం, మెట్ పల్లి టౌన్: పేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష అనే మాటను సర్కారు కళాశాల అధ్యాపకులు కొట్టివేస్తున్నారు. ఈ రోజుల్లో పల్లెల్లో పదవ తరగతి పూర్తికాగానే తల్లిదండ్రులు పేద విద్యార్థులను ప్రైవేట్ కళాశాలలో వేలాది రూపాయలు చెల్లించలేక చదువులు మానిపిస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ససేమీరా అంటుంటారు. కానీ మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులను చదివించేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు.
వసతులు ఉన్నా లేకున్నా పర్వాలేదు తమ పిల్లలను ఈ ప్రభుత్వం కళాశాలలో చేర్పిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ అధ్యాపకులు విద్యతో పాటు, పేద విద్యార్థుల ఆకలిని తీరుస్తున్నారు. కళాశాల అధ్యాపకులు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఒక కొత్త ఆలోచనతో ఒక్క అడుగు ముందుకు వేశారు. కళాశాల అధ్యాపకులు తీసుకున్న నిర్ణయం, అంకితభావం అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కళాశాలలో 300పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.వీరంతా గ్రామీణ ప్రాంతాల్లో నుండి వచ్చేవారు, నిరుపేద విద్యార్థులు, ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకపోవడం వల్ల వారు తినీ,తినక హాజరు అవుతున్నారు.సాయంత్రం వరకు ఉండాలి.ఆకలికీ,ఎండలకు తట్టుకోలేక పోతున్నారు.
ఈ సమస్య గురించి ప్రభుత్వంపై నిందలు వేయకుండా,తమ వంతుగా విద్యార్థుల పూర్తి హాజరు కోసం సమిష్టిగా ప్రణాళిక సిద్ధం చేశారు.మధ్యాహ్నం వారికి భోజన సదుపాయం కల్పించారు.అందుకు అయ్యే ఖర్చులను కూడా తామే భరిస్తూ,పేద విద్యార్థుల ఆకలి తీర్చుకుంటూ, విద్యా బోధన చేస్తున్నారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తూ.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.వ్యయ భారంతో పాటు, స్వయంగా తామే వండి, వడ్డిస్తూ,పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, కళాశాలను అత్యున్నత స్థాయిలో ఉంచుతున్నారు .రానున్న రోజులలో కూడా మరింతగా కృషి చేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడానికి మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహిస్తున్నారు.అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.