Homeతెలంగాణతొమ్మిదన్నరేండ్లలో Group-1 నోటిఫికేషన్ వేయలే

తొమ్మిదన్నరేండ్లలో Group-1 నోటిఫికేషన్ వేయలే

– ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలో స్టూడెంట్లు, తల్లిదండ్రులు ఆలోచించాలి
– బీజేపీ ఎంపీ లక్ష్మణ్​

ఇదే నిజం, హైదరాబాద్: నియామకాల కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగ యువతకు ఇప్పటికీ ఉద్యోగాలు దక్కలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీలో 20 లక్షల మంది యువత తమ పేర్లు నమోదు చేసుకొని ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. నమోదు చేసుకోని యువతను కలిపితే ఆ సంఖ్య 50-60 లక్షల దాకా ఉంటుందని విమర్శించారు. వివిధ శాఖల్లో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్న విషయాన్ని పీఆర్‌సీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క గ్రూప్‌– 1 నోటిఫికేషన్‌ వేయలేదు. డీఎస్సీ ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాక బడులు మూతపడే పరిస్థితి నెలకొంది. మిషన్‌ భగీరథ, హార్టికల్చర్‌, ఇతర శాఖల్లో కాంట్రాక్టు తీరిపోయిందనే నెపంతో దాదాపు 10 వేల మందిని తీసేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి ఆ హామీ నెరవర్చేలేదు. 2014 నుంచి 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్‌ చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్ని ఖాళీలున్నాయో వెల్లడించడం లేదు. 2018లోనూ కొలువుల విషయం గురించి యువత ప్రశ్నిస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటెయ్యాలో స్టూడెంట్లతో పాటు వారి తల్లిదండ్రులు ఆలోచించాలి. కొత్తగా మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేశామని చెప్పుకొనే ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచలేదు. ఇటీవల ప్రవలిక ఆత్మహత్యపై ప్రశ్నిస్తే కేసులు పెట్టారు’అని లక్ష్మణ్‌ వివరించారు.

Recent

- Advertisment -spot_img