Homeఫ్లాష్ ఫ్లాష్Gujarat elections; నేడు గుజరాత్ తొలి దశ ఫైట్

Gujarat elections; నేడు గుజరాత్ తొలి దశ ఫైట్

 Gujarat elections; దేశంలో గుజరాత్ ఎన్నికల మేనియా నెలకొంది. గురువారం తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. గురువారం (డిసెంబర్ 1న) జరిగే పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. గుజరాత్‌లో తొలి దశ ఎన్నికల్లో సౌరాష్ట్ర-కచ్‌తో సహా దక్షిణ గుజరాత్‌లోని 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1 గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. గుజరాత్ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. గుజరాత్‌లో వరుసగా ఏడోసారి కాషాయ జెండాను ఎగురవేసి.. ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ సర్వశక్తుల్ని ధారపోసింది. కమలం కంచుకోటను బద్దలుకొట్టాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుండగా.. ఢిల్లీ, పంజాబ్‌ సూత్రంతో గుజరాత్‌ను కైవసం చేసుకోవాలని ఆప్ దూకుడును ప్రదర్శించింది. ఇప్పటివరకు గుజరాత్‌లో కేవలం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉండగా.. తాజాగా ఆప్‌ అరంగేట్రంతో గుజరాత్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. తొలి విడత ఫైట్‌లో దక్షిణ గుజరాత్‌, సౌరాష్ట్ర, కచ్‌ ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

బరిలో 788 మంది అభ్యర్థులు

తొలి దశ ఎన్నికల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి దశలో మొత్తం 39 రాజకీయ పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలివిడతలో 2 కోట్ల 39 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 6 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి దశకు 25 వేల 430 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 34,324 బ్యాలెట్‌ యూనిట్లు, 34,324 కంట్రోల్‌ యూనిట్లు, 38,749 వీవీప్యాట్‌లను వినియోగించనున్నారు. పోలింగ్ నేపథ్యంలో బూత్‌ల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు.

తొలిదశ ఎన్నికల పోలింగ్ గురించి ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..

  • మొత్తం ఓటర్లు.. 2,39,76,670
  • పురుషులు: 1,24,33,362
  • మహిళలు: 1,15,42,811
  • ట్రాన్స్‌జెండర్లు 497 మంది ఉన్నారు.

కాగా, డిసెంబర్‌ 5వ తేదీన రెండో దశ పోలింగ్‌ జరుగుతుంది. రెండోదశలో 93 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

Recent

- Advertisment -spot_img