– అసంతృప్తిగా ఉన్న ప్రజలు బీఆర్ఎస్కు ఓటేస్తారా?
– కేటీఆర్ కాన్ఫిడెన్స్ ఏంటి?
– కేసీఆర్ సర్కారుపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి
– కొంపముంచిన కొన్ని సంక్షేమ పథకాలు
– ఫలాలు అందని ప్రజల్లో తీవ్ర కోపం
– విద్యార్థులు, యువతలో ఇప్పటికే వ్యతిరేకతే
– వ్యతిరేక ప్రచారం చేస్తున్న ఉద్యోగులు, టీచర్లు
– బీఆర్ఎస్ కు దూరమైన ప్రజాస్వామిక వాదులు
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఇటీవల తెలంగాణ భవన్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలు అలిగినా, గులిగినా ఓట్లు మాత్రం బీఆర్ఎస్కే గుద్దుతారు’ అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత పలు మీడియా సమావేశాల్లోనూ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ కామెంట్లపై చర్చ మొదలైంది. నిజంగా తెలంగాణ ఓటర్లు అలకతోఉన్నా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి. కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. కొన్ని వర్గాల్లో మాత్రం అసంతృప్తి ఉంది. దీనికి తోడు కొన్ని సంక్షేమ పథకాలు బీఆర్ఎస్కు ఓట్లు రాల్చిపెట్టేవి ఉన్నా.. మరికొన్ని పథకాలు మాత్రం కొంపముంచేలా ఉన్నాయి. దళితబంధు, బీసీ బంధు లాంటి పథకాలు కొంతమందికి అందుతుండటంతో మిగిలిన వారిలో కోపం ఉంది. ఇక నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజాస్వామిక వాదులు బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఎలాగూ వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో గులుగుడు సరే ఓట్లు గుద్దడం మాటేమిటి? అన్న చర్చ సాగుతోంది.
ఉద్యోగులు నారాజ్
బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాకూడదని ఉద్యోగుల్లోని మెజార్టీ వర్గం కోరుకుంటోంది. ఇక సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ ఎంతో ఇబ్బంది పెట్టారు. రోజుల తరబడి సమ్మె చేసినా.. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదు. ఆ తర్వాత వారిని పిలిపించి డిమాండ్లు నెరవేర్చారు. ఇక ఇటీవల ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశారు కూడా.. అయితే సమ్మె చేసిన సమయంలో ఆర్టీసీ కార్మికులవి గొంతెమ్మ కోరికలు అని కొట్టిపారేసిన సీఎం.. ఆ తర్వాత అవే డిమాండ్లను నెరవేర్చడం విమర్శలకు తావిచ్చింది. కోర్టులు చెప్పినా సీఎం కేసీఆర్ వినలేదు. కేవలం అశ్వత్థామరెడ్డి అనే ఆర్టీసీ ఉద్యమనాయకుడి మీద కోపంతోనే కేసీఆర్ మొండిగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆర్టీసీని విలీనం చేశారు కనక వారిలో కోపం చల్లారిందా? లేక గతంలో కేసీఆర్ తీరుపై ఇంకా కోపంగానే ఉన్నారా? అన్నది ఎన్నికల నాటికి తెలియనున్నది. ఇక ఎంతో అవినీతి జరుగుతోందని వీఆర్వో వ్యవస్థను సీఎం కేసీఆర్ రద్దు చేశారు. కానీ వారికి దాదాపు కొన్నేండ్ల పాటూ వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు.
నిరుద్యోగులు గుద్దుతారా?
బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతో ఉన్న వర్గం నిరుద్యోగులే. పోటీ పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ ఘోరంగా ఫెయిల్ కావడం.. రెండు సార్లు గ్రూప్ 1 పేపర్ రద్దు కావడంతో తీవ్ర వ్యతిరేత వచ్చింది. ఇక పేపర్ లీకేజీ ఘటన సైతం బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఇక పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదని విపక్షాలు ప్రశ్నించాయి. ఇక దీనికి తోడు టీఎస్ పీఎస్సీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చినా దాన్ని రద్దు చేయకపోవడం.. కనీసం సభ్యులను మార్చకపోవడంతో విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు. దీనికి తోడు ప్రవళ్లిక అనే నిరుద్యోగ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం.. ప్రభుత్వం ఈ ఘటనను హ్యాండిల్ చేసిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రవళ్లిక ఆత్మహత్య విషయంలో లవ్ ఎఫైర్ ను తెరమీదకు తీసుకురావడం.. ఆమె అసలు పరీక్షలే రాయలేని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. ఇక ప్రవళ్లిక వివిధ పరీక్షలకు హాజరైన హాట్ టికెట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మొత్తంగా విద్యార్థులు బీఆర్ఎస్ సర్కారుకు గుద్దుడు కష్టమే. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ఇక విద్యార్థులు ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటారు. వారి మూలాలు గ్రామాల్లో ఉంటాయి కనక.. విద్యార్థుల్లో వచ్చిన వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చే చాన్స్ ఉంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో గుర్తింపు ఉంది. అయితే ఎంతమంది ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పదవులు ఇచ్చింది. ఎందరో ఉద్యమకారులకు బీఆర్ఎస్ సర్కారు పదవులు ఇచ్చింది. అయితే ఉద్యమకారులను పెద్దగా బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. మరి ఈ సారి ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీకి గుద్దుతారా? లేదా? అన్నది వేచి చూడాలి.
దళితబంధు రివర్స్
దళితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు అనే స్కీమ్ తీసుకొచ్చారు. అయితే ఈ పథకం బీఆర్ఎస్ పార్టీకి రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. గ్రామాల్లో వందల సంఖ్యలో దళితబంధును ఆశించేవారు ఉంటే.. కేవలం కొన్ని గ్రామాల్లోనే ఒకరు లేదా ఇద్దరికే డబ్బులు అందాయి. అది కూడా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సిఫారసు దళితబంధు వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీర్ఘకాలిక లక్ష్యంతో దళితబంధును తీసుకొచ్చారు. రూ. 10 లక్షలు సాయం చేసి దళిత కుటుంబాలు చిరు వ్యాపారాలు చేసుకొనేలా ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. కానీ ఈ పథకం ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండగా.. కొంతమందికే ఫలాలు అందాయి. దీంతో మిగిలిన దళితుల్లో వ్యతిరేకత వచ్చింది. దళితబంధు పథకం వల్లే వచ్చే ఓట్లు ఎక్కువా? లేదంటే పోయే ఓట్లు ఎక్కువా? అన్నది వేచి చూడాలి.
తెలంగాణ గీతమేది?
తెలంగాణకు రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర పక్షి, రాష్ట్ర ఆట ఉన్నాయి. కానీ రాష్ట్ర గీతం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజా కవి అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ అన్న పాట ఉద్యమ సమయంలో మార్మోగింది. ప్రజలంతా అనధికారికంగా రాష్ట్ర గీతంగా ఈ పాటను పాడుకున్నారు. అయితే రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పాటను పట్టించుకోలేదు. అందెశ్రీ తనకు అనుకూలంగా లేరు కనక.. ఆ పాటను రాష్ట్ర గీతం చేసేందుకు కేసీఆర్ అంగీకరించలేదన్న విమర్శలు వచ్చాయి. ఈ అంశం సైతం కేసీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీకి మైనస్‌గా మారింది.
అందుబాటులో ఉండని సీఎం
ప్రజలకు అందుబాటులో ఉండరన్నది కేసీఆర్ మీద మరో ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్యేలను కలవడు.. ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారు అన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పలువురు ఉద్యమకారులను ఆయన కనీసం కలవడానికి కూడా ఇష్టపడరన్న ఆరోపణ ఉంది. ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పాట ఎంతోమందిని కదిలించింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దర్ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. గద్దర్ పలుమార్లు కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరగా దొరకలేదు. చివరకు గద్దర్ ప్రగతి భవన్ కు వెళ్లినా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిని కలిసేందుకు గద్దర్ ప్రగతి భవన్ కు వెళ్లి.. మూడు గంటల పాటూ ఎండలో వేచి చూశారు. కానీ ఆయనకు పిలుపురాలేదు. అయితే గద్దర్ చనిపోయిన తర్వాత మాత్రం నాటకీయంగా సీఎం కేసీఆర్ ఆయన మృతదేహానికి నివాళి అర్పించడం గమనార్హం. దీంతో బతికి ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక వాస్తు బాగాలేదని సీఎం కేసీఆర్ పాత సచివాలయం మొహం చూడలేదు. కొత్త సచివాలయాన్ని నిర్మించినా.. అక్కడికి కూడా ఒకడి రెండు సార్లకు మించి వెళ్లలేదు. ఇక ముఖ్యమంత్రి తెలంగాణను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పంజాబ్ రైతులకు పరిహారం ఇవ్వడం.. మహారాష్ట్రకు చెందిన సర్పంచ్ స్థాయి వ్యక్తులను సైతం ప్రగతి భవన్ కు పిలిపించుకొని కండువాలు కప్పడం.. కానీ తెలంగాణ లీడర్లను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపించాయి. రాష్ట్రంలోని అడ్మినిస్ట్రేషన్ మొత్తం గాలికి వదిలి పక్క రాష్ట్రాల కోసం తిరిగారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ కుంగిపోతే సీఎం ఎందుకు పరిశీలించలేదన్న విమర్శ ఉంది. ఇక గతంలో కొండగట్టు ఆలయ సమీపంలో బస్సు బోల్తా పడి 65 మంది చనిపోతే కేసీఆర్ కనీసం పర్యటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇక కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మూడు నెలల పాటు కేబినెట్ విస్తరించకపోవడంతో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీ గెలిచిన అనంతరం కేబినెట్ ఏర్పాటు చేయాలి.. కానీ సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ మినహా మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు.. సహించలేకపోయిన తెలంగాణ వాదులు
కవిత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ దేశాలకు తెలంగాణ ఉద్యమాన్ని విస్తరించారు. ఇక ఊరూరా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని ఆమె లోకానికి చాటి చెప్పారు. అయితే ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడాన్ని తెలంగాణ వాదులు జీర్ణించుకోలేకపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు జాతీయ మీడియాలో ప్రధానంగా వినిపించడం.. పతాక శీర్షికలో ఆమె పేరు రావడాన్ని తెలంగాణ వాదులు అవమానకరంగా ఫీల్ అయ్యారు. ఈ అంశం కూడా బీఆర్ఎస్ కు ప్రతిబంధకంగా మారే చాన్స్ ఉంది.
పేరు మార్చుడు కొంపముంచుతుందా?
ఇక టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అన్న పేరు ఒక ప్రైడ్. ఈ పేరు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిబింబించే విధంగా ఉండటమే అందుకు కారణం. దానికి తోడు ప్రజలు కేసీఆర్‌ను ఉద్యమకారుడు, ఉద్యమనేతగానే చూశారు. అయితే జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం పలువురు తెలంగాణ వాదులు జీర్ణించుకోలేకపోయారు. సొంతపార్టీ కార్యకర్తల్లోనూ ఈ పేరు విషయంలో అసంతృప్తి ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగు తల్లిని తీవ్రంగా విమర్శించిన కేసీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అంశాలున్నాయి. అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారాక కొందరు ఏపీ లీడర్లు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సభా వేదిక ముందు తెలుగుతల్లి విగ్రహాన్ని ఉంచడంతో విమర్శలు వచ్చాయి. ఈ విషయం తెలంగాణ వాదులకు కోపం తెప్పించింది. కేటీఆర్ చెప్పినట్టుగానే రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అలుగుతున్నారు.. గులుగుతున్నారు. అయినా వాళ్లు ఓట్లు గుద్దుతారు అని కేటీఆర్ అంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు గుద్దుతారా? అన్నది డౌటే! మరి ఏం జరగబోతున్నదో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాలి.