H3N2 VIRUS:దేశంలో హెచ్3ఎన్2 వైరస్ భయాలు మొదలయ్యాయి. మొదట్లో సాధారణ జ్వరం, జలుబు అనుకున్న ఈ వైరస్ ఇప్పుడు ప్రాణాంతకం అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితులు వచ్చాయి. దేశ వ్యాప్తంగా వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం రోజు హర్యానా, కర్ణాటకలో రెండు మరణాలు సంభవించాయి. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటి వరకు మొత్తం 90 వైరస్ కేసులు నమోదయ్యాయి.
ఇన్‌ఫ్లూయెంజాను మొత్తం మూడు రకాలుగుఆ వర్గీకరించారు. H1N1, H3N2, ఇన్‌ఫ్లూయెంజా బీ, భారత్‌లో ఇప్పటివరకు H1N1, H3N2 వైరస్‌లను మాత్రమే గుర్తించారు. హర్యానాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఫ్లూతో బాధపడుతున్న రోగులలో 40% పెరుగుదల నమోదైందని నివేదిక పేర్కొంది. పరిస్థితి విషమించకుండా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుఎంజా ఎ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వల్ల ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని ఐసీఎంఆర్ నిపుణులు సూచిస్తున్నారు. గత రెండు, మూడు నెలలుగా హెచ్3ఎన్2 విస్తృతంగా చలామణిలో ఉందని, ఇతర వైరస్‌ల కంటే ప్రాణాంతకం అని వైద్య విభాగం తెలిపింది.