– భారత్‌ను కోరిన ఇజ్రాయెల్ రాయబారని నవోర్ గిలాన్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: హమాస్‌తో యుద్ధం వేళ.. తమ కార్యకలాపాలకు భారత్ అందిస్తోన్న మద్దతుపై ఇజ్రాయెల్ హర్షం వ్యక్తం చేసింది. అదే సమయంలో భారత్ కూడా హమాస్‌పై కఠిన వైఖరి అనుసరించాలని కోరుకుంటోంది. ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ముఖ్యమైన దేశాలు మనతోనే ఉన్నాయి. అవి ప్రజాస్వామ్యాలు. ఇక భారతదేశం హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను’ అని మీడియాతో మాట్లాడుతూ గిలన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమెరికా, కెనడా, ఐరోపా సమాఖ్య వంటివి హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాయని చెప్పారు. దీనికి సంబంధించి తాము ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడామన్నారు.
‘హమాస్ దాడి తర్వాత దాని గురించి ఇక్కడి అధికారులతో మేం మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికీ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ చర్చ స్నేహపూర్వకంగా ఉంది. నా అంచనా ప్రకారం.. మన రెండు దేశాలు ఉగ్రముప్పును అర్థం చేసుకున్నాయి. అయినా, ఇది ఒకరు ఒత్తిడి తెచ్చే అంశం కాదు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఇతర వ్యూహత్మక విషయాల్లో మేం ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నాం’ అని అన్నారు.
ఇజ్రాయెల్ భీకర పోరు
ఈ నెల 7న తమ దేశంలోకి చొరబడి మారణహోమం సృష్టించిన హమాస్‌ను తుడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకర పోరు కొనసాగిస్తోంది. ఈ సమయంలో కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూహు ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ సందర్భంగా ఇజ్రాయెల్‌కు అన్నివిధాల అండగా ఉంటామని మోడీ హామీ ఇచ్చారు. ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో తమ వైఖరి చాలా కాలంగా స్థిరంగా ఉందని భారత్ ఇటీవల స్పష్టం చేసింది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్, గాజాలో మానవతా పరిస్థితులపై స్పందిస్తూ.. ఇరు వర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలని కోరింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేసింది.