– వీడియో రిలీజ్ చేసిన ఐడీఎఫ్
– బుల్డోజర్లతో దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్ సైన్యం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దళాలు.. అక్కడ హమాస్ ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా వేట సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టింది. ఇక్కడ హమాస్ కమాండ్ సెంటర్ ఉన్నట్లు చెబుతున్న ఐడీఎఫ్.. దాన్ని బలపర్చే సాక్ష్యాలను తాజాగా బయటపెట్టింది. అల్ షిఫా ఆస్పత్రిలోని ఎంఆర్ఐ భవనంలో పెద్ద ఎత్తున ఆయుధాలు బయటపడ్డాయి. అందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆస్పత్రిలోని ఎంఆర్ఐ యూనిట్లో దాచి ఉంచిన హమాస్ ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి జొనాథన్ కాన్రికస్ స్వయంగా చూపించారు. ‘అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి గాజాలోని ఆస్పత్రులను హమాస్ తమ నేర కార్యకలాపాలకు వినియోగించుకుంటోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’అని జొనాథన్ అందులో పేర్కొన్నారు. ఎంఆర్ఐ గదిలో హమాస్‌కు చెందిన పలు బ్యాగులు కన్పించాయి. అందులో ఆయుధాలు, మందు గుండు సామగ్రి ఉన్నాయి. ఏకే-47, గ్రనేడ్ల వంటి వాటిని అక్కడ భద్రపర్చినట్లుగా తెలుస్తోంది.
ఆస్పత్రి వద్ద బుల్డోజర్లు..
అల్ షిఫా ఆస్పత్రిలో ఆయుధాలు బయటపడగానే ఇజ్రాయెల్ తమ ఆపరేషన్‌ను మరింత తీవ్రంగా చేసింది. ఈ ఆస్పత్రి కింద హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని చెబుతున్న ఇజ్రాయెల్.. ఆ టన్నెల్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఇక్కడ భారీగా సోదాలు నిర్వహిస్తోంది. నిఘా వర్గాల సాయంతో టన్నెల్ ప్రవేశ మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కాగా.. ఈ ఆస్పత్రిని కూల్చేయాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అల్ షిఫా చుట్టపక్కన బుల్డోజర్లను మోహరించినట్లు తెలిపింది.మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ పోరుతో ఆస్పత్రి వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలో నీరు, విద్యుత్, మెడిసిన్స్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న నవజాత శిశువుల పరిస్థితి దారుణంగా ఉంది. అయితే, ఆస్పత్రిలో రోగులకు అవసరమైన మెడిసిన్స్ తాము సరఫరా చేస్తున్నామని ఐడీఎఫ్ తెలిపింది.