హైదరాబాద్ః జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారం రూ.5420 కోట్లు, ఐజీఎస్టీ రూ.2700 కోట్లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు తెలంగాణ ప్రభుత్వ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకుపోయారు. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కన్సాలిడేట్ ఫండ్ ద్వారా కేంద్రం వాడుకుంటుదని, అదే సమయంలో సెస్ తగ్గినప్పుడు మాత్రం రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలనడం ఏమాత్రం సహేతుకంగా లేదని ఘాటుగా కేంద్రానికి తెలియజేశారు. రాష్ట్రాల ఆదాయాలకు ఢోకా లేదని కేంద్రం హామీ ఇస్తేనే జీఎస్టీలో అన్ని రాష్ట్రాలు చేరినట్లు గుర్తుచేశారు. జీఎస్టీలో చేరడం మూలంగా రాష్ట్రాలు 60 శాతం మేరకు ఆదాయాలు కోల్సోవాల్సి వచ్చిందని ఇదే సమయంలో కేంద్రం కోల్పోయింది మాత్రం 30 శాతం లోపేనని అందుకే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చేల్లించాల్సిందేనని కండబద్దలు కొట్టారు. గతంలో జరిగిన జీఎస్టీ సమావేశంలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రికి హరీశ్ గుర్తుచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హాజరయ్యారు.