Harihara Veeramallu Movie : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి మరియు ఎ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. తెలంగాణ పోరాట యోధుడు, పాలమూరు కేంద్రంగా పనిచేసిన పండుగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా సాయన్న చరిత్రను వక్రీకరించి, సినిమాకు అనుగుణంగా కల్పిత కథను జోడించారని ముదిరాజ్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.
పండుగ సాయన్న తెలంగాణలోని పాలమూరు (మహబూబ్‌నగర్) ప్రాంతంలో 19వ శతాబ్దంలో దొరలు, దేశ్‌ముఖ్‌ల సంపదను కొల్లగొట్టి, పేదలకు పంచిన ధీరుడిగా చరిత్రలో నిలిచారు. ‘తెలంగాణ రాబిన్ హుడ్’గా పేరొందిన సాయన్న, అణగారిన వర్గాలకు ఆదర్శంగా నిలిచారు. ఆయన జీవితం సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం అంకితమైన పోరాటంగా చరిత్రలో చోటు చేసుకుంది.