Harish Rao : కాంగ్రెస్ పార్టీపై బిఆర్ఎస్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలవోకగా అబద్ధాలు, ప్రజలను నమ్మించే ప్రయత్నాలు.. హామీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ఎంచుకున్న రాచమార్గం.. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులందరిదీ ఒకే దారి అని హరీష్ రావు అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల విషయంలో ఆర్థిక మంత్రి భట్టి గారు నిన్న మంచిర్యాలలో మంచినీళ్లు తాగినంత సులువుగా మరోసారి అబద్ధాలు చెప్పారు.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చామని మళ్ళీ అదే పాత పాట పాడి మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశారు అని ఆరోపించారు.బ్యాంకు లింకేజీ కల్పించి, మొత్తం 21 వేలు వడ్డీ లేని రుణాలే అని ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ కే చెల్లింది.
ఇదేవిధంగా, స్కూల్ విద్యార్థుల డ్రెస్ కుట్టు చార్జీలు 50 రూపాయలు ఇచ్చి, 75 రూపాయలు ఇస్తున్నం అని ప్రచారం చేసుకున్నరు. మేము నిలదీస్తే మిగతా 25 రూపాయలు విడుదల చేశారు, సంతోషం. కానీ ఇవి ఇంకా మహిళలకు చేరలేదు. వెంటనే చెల్లించండి అని డిమాండ్ చేసారు. స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇచ్చే ‘శ్రీనిధి’ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం దురదృష్టకరం. మొత్తం రుణాలలో 40 శాతం వాటా నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPA) ఉండటం శ్రీనిధి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించి శ్రీనిధి భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మీరు మహిళలకు చేసింది ఎడతెగని వంచనే అని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మిగిలింది ఎడతెగని వేదనే.. మహిళలను కోటీశ్వరులను కాదు, కనీసం లక్షాధికారులుగా కూడా చేయని చేతగాని సర్కారు మీది.ఇప్పటికైనా ప్రచార యావ పక్కన బెట్టి, మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వడ్డీ లేని రుణాలపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని, లేదంటే మహిళలే మీకు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం అని హరీష్ రావు అన్నారు.