Homeహైదరాబాద్latest NewsHarish Rao : కాంగ్రెస్ ప్రజల పాలిట అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం.. హరీష్ రావు...

Harish Rao : కాంగ్రెస్ ప్రజల పాలిట అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..!!

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేసారు. జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరం అని హరీష్ రావు అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా, బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసింది అని పేర్కొన్నారు. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన ఆ రైతన్న దుస్థితికి ప్రభుత్వమే కారణం అని అన్నారు. గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి అని తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఈనెల 26వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, మరోవైపు గ్రామ సభల్లో విడుదల చేసిన జాబితా ఫైనల్ కాదని సాక్షాత్తూ భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు అని నిలదీశారు. సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే కాంగ్రెస్ దృష్టి ఉంది అని మండిపడ్డారు.రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలు పేదలకు అందించాలనే చిత్తశుద్ది ఉంటే, గ్రామ సభల పేరిట ఎందుకు ఇంత డ్రామా అని ప్రశ్నించారు.
దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంది.గ్రామ సభల సాక్సిగా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న దృశ్యాలు.. మీ పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి అని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం అని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని హరీష్ రావు తెలిపారు.

Recent

- Advertisment -spot_img