– హస్తం పార్టీ అంటేనే నాటకం
– కేసీఆర్ ఓ నమ్మకం
– మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు
ఇదే నిజం, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులకు పదవుల మీదు ఉన్న ధ్యాస పని మీద ఉండదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ అంటే ఓ నమ్మకమని.. కాంగ్రెస్ అంటే నాటకమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులపై పగపబట్టిందని హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటుచేసిన ఇబ్రహీంపట్నం బీఆర్‌ఎస్ సెగ్మెంట్ స్థాయి బూత్‌కమిటీ నాయకుల సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గెలువలేని అభ్యర్థులు కూడా నేనే సీఎం అంటున్నారని సెటైర్ వేశారు. రైతుబంధు ఇవ్వొద్దని ఆ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, ముఠాలు అని ఆరోపించారు. ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని నమ్మకం వ్యక్తంచేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా కిషన్ రెడ్డి పారిపోయారని గుర్తుచేశారు. ఇలాంటి నాయకులా కేసీఆర్‌కు పోటీ అని విమర్శించారు. కేసీఆర్‌కు పనితనం తప్ప.. పగతనం లేదని స్పష్టం చేశారు.రైతుబంధును సృష్టించిందే సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుల దగ్గర పన్నులు వసూలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రైతుకే పెట్టుబడి ఇచ్చింది బీఆర్‌ఎస్ పార్టీ అన్నారు. రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగలా చేశామని తెలిపారు. పంటపెట్టుబడి సాయం కింద రూ.72 వేల కోట్లు ఇచ్చామన్నారు. కర్ణాటకలో రైతులకు 3 గంటలు కూడా కరెంటు రావడం లేదని చెప్పారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అందువల్ల మహిళలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తూ తాగునీటి కష్టాలు తీర్చారన్నారు. తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తదని మంత్రి అన్నారు.వచ్చే ఐదేండ్లలో ఇబ్రహీంపట్నంకు సాగునీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు.