Homeహైదరాబాద్latest Newsహరీశ్​ రావు.. రాజీనామా లెటర్ జేబులో పెట్టుకో: రేవంత్ రెడ్డి

హరీశ్​ రావు.. రాజీనామా లెటర్ జేబులో పెట్టుకో: రేవంత్ రెడ్డి

ఇదే నిజం, వరంగల్ జిల్లా: ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో బుధవారం వరంగల్​లో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభకు ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్‌పై రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘రైతు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావు రాజీనామా చేస్తామంటున్నారు. ఆగస్టు 15లోపు రూ.2లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్‌రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలి. కేసీఆర్‌ మాదిరిగా హరీశ్‌రావు మాట తప్పవద్దు’అని సీఎం సూచించారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించే నాయకులు కావాలని రేవంత్ రెడ్డి అన్నారు.

‘ఎంపీ టికెట్‌ కోసం కడియం శ్రీహరి కాంగ్రెస్‌ను సంప్రదించలేదు. కడియం వద్దకు కాంగ్రెస్‌ పెద్దలను పంపించాం. మెదడు కరిగించి కాళేశ్వరం కట్టామని కేసీఆర్‌ చెబుతున్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. మేడిగడ్డ మేడిపండు అయింది.. సుందిళ్ల సున్నా అయింది. అన్నారం ఆకాశంలో కలిసింది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూడాలి. కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నా.. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం వద్దకు రండి. అక్కడే కూర్చొని నిపుణులతో చర్చిద్దాం’అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్​కు లోక్​సభ ఎన్నికల్లో ఎక్కడా డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవన్నారు.

అసెంబ్లీకి రాని కేసీఆర్‌… టీవీ స్టూడియోల్లో గంటలపాటు కూర్చొని ప్రగల్భాలు పలుకుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘పదేళ్లు సీఎంగా పనిచేసిన ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయని సీఎం అన్నారు. ‘వరంగల్‌ అంటే దేశానికి తలమానికమైన పీవీ, కాళోజీ, జయశంకర్‌ గుర్తొస్తారు. హైదరాబాద్‌ మాదిరిగా వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌రోడ్డుతో పాటు ఎయిర్‌పోర్టు నిర్మిస్తాం. ఈ నగరానికి మహర్దశ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. కాకతీయ యూనివర్సిటీ నిర్వీర్యమైంది. వీసీతో పాటు బోధనాసిబ్బందిని నియమిస్తాం. యూనివర్సిటీని ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్య అందిస్తాం’అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img