Homeహైదరాబాద్latest Newsహరీశ్‌రావు వర్సెస్ మంత్రులు.. అసెంబ్లీలో బడ్జెట్‌పై హోరా హోరి..

హరీశ్‌రావు వర్సెస్ మంత్రులు.. అసెంబ్లీలో బడ్జెట్‌పై హోరా హోరి..

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగింది. శనివారం అసెంబ్లీలో జరిగిన బడ్జెట్‌పై ప్రసంగం.. రాజకీయ ప్రసంగంలా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలకు మాజీ మంత్రి హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి హరీశ్‌రావు గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారని, కానీ బీఆర్ఎస్ అంటేనే అబద్ధాలకు పుట్టిల్లు అన్నారు. బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామన్న కేసీఆర్ సభకే రాలేదన్నారు. సభలో సమాధానం చెప్పలేక కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని విమర్శించారు. ఆయన స్థానంలో హరీశ్‌రావును పంపించారన్నారు. హరీశ్‌రావు ఓ డమ్మీ నాయకుడన్నారు. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా ఉందన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చామని హరీశ్‌రావు చెప్పారని, కానీ అందులో నిజం లేదన్నారు. హరీశ్‌రావు వద్ద సబ్జెక్ట్ లేదని ఎద్దేవా చేశారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్య మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు రికార్డ్స్ నుంచి తొలగించుకోండని హరీశ్‌రావు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు సూచించారు. అంతేకాదు రేవంత్‌రెడ్డి డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనలేదా? అని ప్రశ్నించారు.

బడ్జెట్‌ ప్రసంగమా? రాజకీయ ప్రసంగమా..? మాజీ మంత్రి హరీశ్‌రావు

బడ్జెట్‌ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘రూ.4.5 లక్షలు లేని జీఎస్‌డీపీని.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.14 లక్షలకు తీసుకెళ్లింది. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన బాగా లేదని మాటలు చెబితే సరిపోదు. దానికి ఆధారాలు చూపించండి. మా పనితీరు తెలియకూడదని పదేళ్ల ప్రభుత్వ సమాచారాన్ని తొలగించారు. కంప్యూటర్‌ నుంచి తొలగిస్తారేమో కానీ.. ప్రజల మెదడు నుంచి తొలగించలేరు. రాష్ట్ర బడ్జెట్‌ అవాస్తవాలతో నిండి ఉంది. ట్యాక్స్‌ రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్‌లో పెట్టారు. విధానాల రూపకల్పన కంటే మమ్మల్ని తిట్టడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూలో రూ.35 వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో చూపారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇప్పుడు రూ.10 వేల కోట్ల విలువ చేసే భూములు అమ్మి నిధులు సమీకరిస్తామని చెప్పారు. మీ మాటపై గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి. సాధ్యం కాని తరహాలో ఆదాయం ఎక్కువ చూపారు. తప్పనిసరి ఖర్చులను తక్కువ చేసి చూపారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు మాత్రమే వస్తోంది. ఆలస్యమైందని వడ్డీ రైతు నుంచి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆలస్యం చేసి వడ్డీ భారాన్ని రైతులపై మోపుతోంది’ అని హరీశ్‌రావు విమర్శించారు.

హరీశ్‌రావు డమ్మీ… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘హరీశ్‌రావు వద్ద సబ్జెక్ట్‌ లేదు. అబద్దాలు, గారడీలు అంటే బీఆర్‌ఎస్సే. హరీశ్‌ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. ఆయన బడ్జెట్‌పై కాకుండా రాజకీయాలు సభలో మాట్లాడుతున్నారు. ఉద్యమంలో కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తా అన్నారు. దళితుడిని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదు. కేసీఆర్ బడ్జెట్‌పై చీల్చి చెండాడుతా అన్నారు. ఏం చీల్చుతారో అని నేను అసెంబ్లీకి వచ్చాను. కానీ కేసీఆరే రాలేదు. ఆయనకు సభకు రావాలంటే భయం. అందుకే వీళ్లను పంపాడు. గతంలో హరీశ్‌రావు ఒక డమ్మీ మంత్రి. బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.

హరీశ్.. భట్టి మధ్య మాటల యుద్ధం..
అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. మొదట హరీశ్‌రావు మట్లాడుతూ బీఆర్ఎస్ టార్గె‌ట్‌గానే బడ్జెట్ ప్రసంగం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇస్తూ అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టామని, హరీశ్‌రావును సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. దీంతో హరీశ్ స్పందిస్తూ.. మద్యంపై ఆదాయం పెరుగుతందని బడ్జెట్‌లో తెలిపారని, ఎలా పెరుగుతుందో చెప్పాలన్నారు. మద్యం ధరలు పెంచి ఆదాయం సమకూర్చకుంటారా అని హరీశ్ ప్రశ్నించారు. దీనికి భట్టి స్పందిస్తూ ‘టానిక్’ లాంటి మద్యం దుకాణాలు పెట్టి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బీఆర్ఎస్ నాయకులు పెట్టారని, ఆ ఆదాయం మొత్తం రాష్ట్రానికి తిరిగి వచ్చేలా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img