Harish Rao : రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల అరెస్టులను బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అని హరీష్ రావు (Harish Rao) అన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించడం దుర్మార్గం అని అన్నారు. ఆశా సోదరీమణుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకింత నిర్బందం, ఎందుకింత నిరంకుశత్వం.. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అని హరిశ రావు నిలదీశారు. హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని 15నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. కాంగ్రెస్ చేసిన నయ వంచన పై ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. నిలదీత నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బందాన్ని ప్రయోగిస్తూ, తప్పించుకుంటున్నది. గొంతెత్తిన వారిని అక్రమంగా అరెస్టులు చేస్తూ, అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నది. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది, రెండు పూర్తి స్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టింది. ఇంకా ఎన్నాళ్లూ హామీలు అమలు చేయకుండా సాకులు చెబుతారు రేవంత్ రెడ్డి గారు.. ఎన్నికల హామీ ప్రకారం, ఆశా వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన హామీ నెరవేర్చే దాకా ఆశా వర్కర్ల పోరాటానికి బిఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాం అని పేర్కొన్నారు.