గ్లోబల్ ఎలక్ట్రిక్ టెస్లా కారు భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం అవుతుందా?.. అంటే పరిస్థితులు సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నది.
టెస్లాతోపాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విద్యుత్ కార్లపై దిగుమతి సుంకం తగ్గించడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
దేశీయ ఆర్థిక వ్రుద్ధిరేటును ప్రోత్సహిస్తే దిగుమతి చేసుకుంటున్న టెస్లా విద్యుత్ కార్లపై రాయితీలతోపాటు దిగుమతి సుంకం తగ్గించడానికి సిద్ధం అని అధికార వర్గాలు తెలిపాయి.
40 శాతానికి దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని ఇద్దరు అధికారులు అంటున్నారు.
40 శాతం దిగుమతి సుంకం తగ్గింపు?
కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ కార్లపై దిగుమతి సుంకం 40 శాతానికి తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నది.
దిగుమతి సుంకం తగ్గించాలని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేసిన అభ్యర్థనపై దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ రెండుగా చీలింది.
దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కారు ధర, బీమా, రవాణాతోపాటు విలువ 40 వేల డాలర్లలోపు ఉంటుంది.
ఈ నేపథ్యంలో 60 నుంచి 40 శాతానికి సుంకం తగ్గింపు ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి.
ఒకవేళ ఎలక్ట్రిక్ కారు విలువ 40 వేల డాలర్ల పై చిలుకు ఉంటే.. దానిపై దిగుమతి సుంకం 100 నుంచి 60 శాతం తగ్గించాలన్న ప్రతిపాదన ఉందని అధికారులు చెప్పారు.
దిగుమతి సుంకం తగ్గింపు ఖాయమని చెప్పలేమని, కానీ చర్చలు జరుగుతున్నాయన్నారు.
సుంకం తగ్గింపుతో సేల్స్ పెరుగుదల
దిగుమతి సుంకం 40 శాతం తగ్గుముఖం పట్టడం వల్ల ఎలక్ట్రిక్ కార్లు చౌకగా లభిస్తాయని, సేల్స్ పెరుగుతాయని టెస్లా వాదిస్తున్నది.
ఒకవేళ టెస్లాకు మినహాయింపులు కల్పిస్తే.. దేశీయ కార్ల తయారీ సంస్థలకూ కొంత రిలీఫ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
ఈ నేపథ్యంలోనే టెస్లాతోపాటు దేశీయంగా ఉత్పత్తవుతున్న కార్లకు, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్ కార్లపై సుంకాలు తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తున్నది.
తొలుత దిగుమతి చేసుకున్న కార్లు విజయవంతంగా అమ్ముడైతే, భారత్‌లో ప్రొడక్షన్ యూనిట్ పెడతామని ఎలన్ మస్క్ గత నెలలో ట్వీట్ చేశారు.
సుంకం తగ్గింపు సరే.. ఏకానమీ సంగతేంటి?
దిగుమతి సుంకం తగ్గించడం సమస్య కాదని, దాని వల్ల ఒనగూడే ఆర్థిక లబ్ధిని పరిగణనలోకి తీసుకోవాలని అధికార వర్గాలు తెలిపాయి.
దేశీయ ఆటోమొబైల్ సంస్థల ఆందోళనలు, డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆ వర్గాల కథనం.
ప్రపంచ కార్ల మార్కెట్‌లో భారత్‌ది ఐదో స్థానం. ప్రతిఏటా 30 లక్షల కార్లు అమ్ముడవుతాయి.
వాటిలో మెజారిటీ కార్ల ధర 20 వేల డాలర్ల విలువ లోపు ఉన్నవే కావడం గమనార్హం. కార్లపై దిగుమతి సుంకం తగ్గింపు అంశంపై కేంద్ర ఆర్థిక, వాణిజ్యశాఖలు, నీతి ఆయోగ్ స్పందించలేదు.
మెర్సిడెజ్.. ఆడి ఇలా ఒత్తిళ్లు
దాల్మియర్ వారి మెర్సిడెస్ బెంజ్, ఆడి కార్ల యాజమాన్యాలు ఏండ్ల తరబడి విలాసవంతమైన కార్లపై దిగుమతి సుంకాలు తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి.
ఈ ప్రతిపాదనకు దేశీయ కంపెనీల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది.
ఫలితంగా భారత్‌లో లగ్జరీ కార్ల మార్కెట్ చిన్నదిగా మారింది. ఏటా సగటున 35 వేల కార్లను విక్రయిస్తున్నది
హై ఎండ్ క్యాటగిరీలోకి టెస్లా కార్లు
టెస్లా కార్లు హై ఎండ్ ఈవీ క్యాటగిరీలోకి వస్తాయి. భారత్‌లోకి దిగుమతి చేయడం వల్ల చాలా తక్కువగా అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే మెర్సిడెస్, జాగ్వార్ లాండ్ రోవర్, ఆడి కార్లు తమ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను దేశీయ విపణిలో అమ్ముతున్నాయి.
దిగుమతి సుంకం తగ్గించాలన్న టెస్లా డిమాండ్‌కు మెర్సిడెస్‌తోపాటు హ్యుండాయ్ మోటార్స్ నుంచి మద్దతు లభిస్తున్నది.
దేశీయ కార్ల మార్కెట్లో హ్యుండాయ్ వాటా 18 శాతం.
టాటా మోటార్స్‌తోపాటు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విపణిలోకి తీసుకొస్తున్న ఓలా వ్యతిరేకిస్తున్నాయి.