ఏపీకి రాజధాని ఉందా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి అమరావతిని రాజధాని చేశారు. అయితే ఈ నగరాన్ని ఆయన పూర్తిగా నిర్మించలేకపోయారు. దీంతో జగన్ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ నిర్ణయాన్ని తిరగదోడారు. ఏపీకి ఒక్క రాజధాని కాదు.. మూడు రాజధానులు అంటూ ప్రకటించారు. అమరావతి శాసనరాజధాని, విశాఖ పాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానికి ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు. కానీ అమరావతి రైతులు కోర్టుకు వెళ్లడంతో ఈ నిర్ణయం ప్రస్తుతానికి పెండింగ్ లో పడింది. దీంతో గత ఐదేండ్లుగా జగన్ అమరావతి కేంద్రంగానే పాలన కొనసాగిస్తున్నారు. విశాఖ వెళ్లబోతున్నామని గతంలో ప్రకటించినప్పటికీ కోర్టు చిక్కుల వల్ల వెళ్లలేకపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీకి రాజధాని ఏది? అన్న విషయంపై మంత్రి అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఏపీకి అమరావతే రాజధాని అని చెప్పారు.