Health: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కొబ్బరి చిప్పలు, ఖాళీ బొండాలు, కోడి గుడ్డు పెంకులు, మొక్కల తొట్టిలు, వృథాగా ఉన్న టైర్లు, వేసవిలో వాడిన కూలర్లలో నీళ్లు ఉంటే దోమలు తయారై డెంగీ ప్రబలే అవకాశం ఉంది. మురుగు, నిల్వ నీరు మలేరియా, ఫైలేరియా ప్రబలేందుకు దోహదం చేస్తాయి. వానాకాలంలో పరిస్థితి మరింత తీవ్రత చాటే అవకాశం ఉన్న దృష్ట్యా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్ల వద్ద నీటి నిల్వ పాత్రలు, కూలర్లు, డ్రమ్ములు ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు.
అయితే డెంగీ జ్వరం వచ్చినపుడు జాగ్రత్తగా మందులు వాడాల్సిందే. రక్త పరీక్ష చేయించుకుంటే డెంగీ అవునో కాదో తేలిపోతుంది. జ్వరం తగ్గిన తర్వాత చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా, కడుపునొప్పి ఉండటం, వాంతులు కావడం లాంటి లక్షణాలు కనిపించగానే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. జ్వరం రాగానే ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. దీనితో రక్తపోటు తగ్గకుండా ఉంటుంది. రోగనిరోధకతను పెంచుకోవడానికి ఆహారం, పండ్లు తీసుకోవాలి. 10-20 వేల కంటే తక్కువకు ప్లేట్‌లెట్లు పడిపోయినపుడే వాటిని ఎక్కించాలి. వీటన్నింటి కంటే దోమల నివారణ చాలా ముఖ్యమని గుర్తించాలి.