Healthy Sleep good for heart : రాత్రి 10 గంటల్లోపే నిద్రపోతేనే గుండె పదిలం..
రాత్రిపూట నిర్దేశిత సమయంలో(Healthy Sleep)నే నిద్ర పోవడానికి, గుండె ఆరోగ్యానికి ఏదైనా సంబంధం ఉందా?
ఉండొచ్చనే అంటున్నాయి పరిశోధనలు.
సరైన వేళలో నిద్ర పోవడం వల్ల హృదయం సంబంధ సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన అధ్యయనాలలో గుర్తించారు.
రాత్రిపూట 10 నుంచి 11 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించే వారిలో హృదయ సంబంధం సమస్యలు తక్కువగా ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది.
యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన బయోబ్యాంక్ నిర్వహించిన ఈ అధ్యయనంలో 88,000 మంది వలంటీర్లపై పరిశోధనలు చేశారు.
శరీరానికి ఒక క్లాక్ ఉంటుందని, దానికి తగ్గట్టుగా నిద్ర సమయాన్ని ఎంచుకోవడం గుండెపోటులాంటి సమస్యలు ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.
మెరుగైన ఆరోగ్యానికి, చురుకుదనం కోసం శరీరానికి ఉండే 24 గంటల లయ (బాడీ క్లాక్) ను క్రమబద్ధంగా సాగనివ్వడం చాలా అవసరం.
దీనిపైనే మనిషి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
ఇది రక్తపోటు వంటి వాటిని కూడా ప్రభావితం చేస్తుంది.
అధ్యయనం జరిగిందిలా…
యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో వలంటీర్లకు చేతికి ధరించే గడియారం లాంటి పరికరాన్ని ఉపయోగించి ఏడు రోజుల పాటు వారు నిద్రించే, మేల్కొనే సమయాల పై డేటాను పరిశోధకులు సేకరించారు.
సగటున ఆరు సంవత్సరాలలో గుండె, రక్త ప్రసరణ ఆరోగ్యం విషయంలో వలంటీర్‌లలో ఎలాంటి పరిణామాలు ఏర్పడ్డాయో గమనించారు.
వీరిలో కేవలం 3,000 మంది అడల్ట్స్ హృదయ సంబంధ వ్యాధులకు లోనయ్యారు.
పైగా వీరిలో రాత్రి పూట 11 తర్వాత లేదంటే ముందు నిద్ర పోయిన వారే ఎక్కువగా ఉన్నారు.
గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపించే ఇతర అంశాలపై కూడా పరిశోధకులు దృష్టి సారించారు.
వలంటీర్ల వయసు, బరువు, కొలెస్ట్రాల్ స్థాయిల వంటి వాటిని కూడా పరిశీలించడానికి ప్రయత్నించారు.
కానీ, ఇందులో వాటి ప్రభావం కనిపించ లేదు.
హెల్త్‌టెక్ సంస్థ హుమాతో కలిసి పనిచేస్తున్న ఈ అధ్యయనం రచయిత డాక్టర్ డేవిడ్ ప్లాన్స్ దీని గురించి వివరణ ఇచ్చారు.
“మా అధ్యయనంతో పూర్తి నిర్ధరణకు రావడం కష్టం.
అయితే, ఆలస్యంగా నిద్ర పోవడం అనేది బాడీ క్లాక్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
దానివల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల పరిణామాలు ఉన్నట్లు మా అధ్యయనాలు చెబుతున్నాయి” అన్నారు.
“రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మరింత ప్రమాదకరం.
ఎందుకంటే ఇది బాడీక్లాక్‌ను సెట్ చేసే ఉదయపు వెలుతురు శరీరానికి అందకుండా చేస్తుంది” అన్నారాయన.
”రాత్రి పూట 10-11 గంటల మధ్య నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి చాలామంచిదని మా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి” అని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌లోని సీనియర్ కార్డియాక్ నర్స్‌గా పని చేస్తున్న రెజీనా గిబ్లిన్ అన్నారు.
ఈ అధ్యయనాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
“అయితే, ఈ అధ్యయనం ఆ రెండింటి మధ్య ఉన్న అనుబంధాన్ని మాత్రమే చూపగలదు.
కారణాలను, ప్రభావాలను రుజువు చేయలేదని గుర్తుంచుకోవడం ముఖ్యం.
గుండె, రక్త ప్రసరణ వ్యాధులకు ప్రమాద కారకంగా మారే నిద్రకు ఉపక్రమించే సమయం, నిద్రించే వ్యవధిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
మన సాధారణ ఆరోగ్యంతోపాటు, గుండె , రక్త ప్రసరణ ఆరోగ్యాలు కూడా బాగుండాలంటే తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం.
పెద్దవాళ్లు రాత్రిపూట ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు నిద్రపోయేలా చూసుకోవడం మంచిదని ఆమె చెప్పారు.
“కానీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఏకైక అంశం నిద్ర ఒక్కటే కాదు.
రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను కూడా తెలుసుకుంటూ ఉండటం మంచిది.
అవసరమైన బరువు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఉప్పు, ఆల్కహాల్‌లను తగ్గించడంతో పాటు మీ లైఫ్‌స్టైల్ జాగ్రత్తగా చూసుకోవాలి.
సమతుల ఆహారం కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది” అన్నారామె.