ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కవితకు ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందని అంచనాలున్నాయి. కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత మార్చి 15న అరెస్ట్ అయ్యింది. ఆమె గత ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉంటోంది. ఆమె పై ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైంది. కాగా ఈ కేసుకు సంబంధించి కవిత నేరుగా డబ్బులు తీసుకున్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. కవితను ఇప్పడికే ఈడీ, సీబీఐ పలుమార్లు విచారించింది. మరోవైపు కవిత జైలులో పలుమార్లు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
ఇటీవల ఎయిమ్స్ లో చికిత్స కూడా చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో మానవతా దృక్ఫథంలో ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కవిత తరఫున సుప్రీం కోర్టులో ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఇదే కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు కొద్ది రోజుల క్రితమే సుప్రీం బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులకు బెయిల్ అనేది హక్కు, అని నేరం రుజువు కానప్పుడు ఎక్కువ కాలం జైలులో ఉంచరాదని పేర్కొంది. మరో వైపు సోమవారం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఢిల్లీ బయలుదేరారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ రావడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.