Heavy Rains : రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం సాధారణం కంటే చల్లగా మారింది. హైదరాబాద్ నగరంలోని చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అకాల వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. పదర మండలం కోడోని పల్లి గ్రామంలో వేరుశనగ తోటల్లో పని చేస్తుండగా పిడుగు పడి సుంకరి సైదమ్మ, ఈదమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడ్డాయి.