– విద్యాసంస్థల మూసివేత
– అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరువచ్చి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలను మూసివేసింది. కొట్టాయం, వైకోమ్, చంగనస్సేరి, అలప్పుజాలోని చేర్యాల, చెంగన్నూర్ సహా పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో వరదల కారణంగా 17 సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో సుమారు 246 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ మేరకు నాలుగు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా హై రేంజ్‌లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కోరింది.