Live In Relationship : వయోజనులైన ఇద్దరు వ్యక్తులు సహజీవనం(Live In Relationship) చేస్తే తప్పేమీ లేదని పంజాబ్-హరియాణా హైకోర్టు(Punjab And Haryana High Court) అభిప్రాయపడింది.
సహజీవనం చేస్తున్న ఓ జంట తమను రక్షించాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
సహజీవనం(Live In Relationship) విషయంలో పంజాబ్-హరియాణా హైకోర్టు(Punjab And Haryana High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
వయోజనులైన ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయడంలో తప్పేమీ లేదని స్పష్టం చేసింది.
సహజీవనం చేస్తున్న ఓ జంట దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఏంటీ కేసు…
తమను వేధింపుల నుంచి రక్షించి, స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ సహజీవనం చేస్తున్న ఓ జంట.. హైకోర్టును ఆశ్రయించింది.
తన భార్య తరఫు కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో పోలీసుల నుంచి తమకు ఎదురవుతున్న వేధింపులను ఆపేలా ఆదేశాలివ్వాలని కోరింది.
పిటిషనర్ల తరఫున అడ్వకేట్ దినేష్ మహాజన్ వాదనలు వినిపించారు.
పిటిషన్‌దారుడైన సదరు వ్యక్తి.. తన భార్య నుంచి విడాకులు కోరుతూ గతంలోనే పిటిషన్ దాఖలు చేశాడని చెప్పారు.
అది 2008 నుంచి ఇంకా హైకోర్టులోనే పెండింగ్‌లోనే ఉందని తెలిపారు.
ప్రస్తుతం వేరే మహిళతో సహజీవనంలో ఉన్నందున ఆ వ్యక్తికి తన భార్య తరఫు వారి నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు.
పంజాబ్‌లోని ఖన్నా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఈ జంటపై వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.
వాదనలు విన్న జస్టిస్ అమోల్ రత్తన్ సింగ్ ధర్మాసనం.. 2018లో సుప్రీంకోర్టు ఐపీసీ సెక్షన్ 497ను(వివాహేతర సంబంధం నేరం అని చెప్పే సెక్షన్‌ను) కొట్టేసిన అంశాన్ని ప్రస్తావించింది.
“పిటిషన్‌దారులు ఎలాంటి నేరానికి పాల్పడ్డట్లు కనిపించడం లేదు. వయోజనులైన ఆ ఇద్దరు సహజీవనంలో ఉన్నారు.
ఆ వ్యక్తి భార్యతో విడాకుల పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నా, లేకపోయినా.. ప్రస్తుత పిటిషన్‌కు, దానికి సంబంధం లేదు.”
-హైకోర్టు.
పిటిషన్‌దారుల ప్రాణాలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఖన్నా ఎస్ఎస్పీని ధర్మాసనం ఆదేశించింది.
మళ్లీ ఆ జంటపై వేధింపులకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది. ఈ కేసును సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది.