ఇదేనిజం, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో భానుడి భగభగలకన్నా రాజకీయ వేడే ఎక్కువగా సెగలు పుట్టిస్తోంది. ప్రజల్లో, నాయకుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ లా కథ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎవరు ఎప్పుడు ఎటునుంచి ఎటు జంప్ చేస్తారో అంతుచిక్కడం లేదు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరతారనే విషయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ నేతల ఆహ్వానాన్ని తిరస్కరించకుండా సున్నితంగా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే జరిగితే వరంగల్‌లో బీఆర్‌ఎస్ ఉనికి కనుమరుగయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరడంతో పార్టీ కాడర్ బలహీనపడింది. కడియం కావ్య వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. సీనియర్ నాయకులు చేసేదీమీ లేక అచేతన వ్యవస్థలో ఉండిపోతున్నారు.
ఇదిలా ఉండగా కడియం శ్రీహరిపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు. ఇటీవలే అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. అవకాశం ఇస్తే మళ్లీ బరిలోకి దిగేందుకు కేసీఅర్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని పరిశీలిస్తే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ పార్టీ కనుమరుగయ్యేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ‘వందేళ్లు గుర్తుండేలా పరిపాలిస్తాం. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం.’ అన్న కేటీఆర్, పార్టీ అధినేత కేసీఆర్ ప్రస్తుత పరిస్థితులపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. పార్టీని ఎలా కాపాడుకుంటారనేది ప్రధాన సవాలుగా ఉంది. Lets see how it will go.