Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడటంతో అతలాకుతలమైంది. రుతుపవనాల ఉధృతి కారణంగా రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటివరకు ఈ వర్ష సంబంధిత ఘటనల్లో 75 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా మండి జిల్లా ఈ విపత్తుకు తీవ్రంగా గురైంది, ఇక్కడ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. భారత వాతావరణ శాఖ (IMD) వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా రోడ్లు, 14 వంతెనలు కొట్టుకుపోయాయి. 600కి పైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో వేలాది మంది చీకట్లో గడుపుతున్నారు. 281 నీటి సరఫరా వ్యవస్థలు ధ్వంసమై, తాగునీటి సంక్షోభం తలెత్తింది. 300కి పైగా పశువులు మృత్యువాతపడ్డాయి, వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. రాష్ట్రానికి సుమారు రూ.700 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ ప్రకటించారు.