Homeహైదరాబాద్latest Newsరాత్రి వేళల్లో తిరుగుతున్న ఆకతాయిలు.. భయాందోళనలతో కాలనీ వాసులు

రాత్రి వేళల్లో తిరుగుతున్న ఆకతాయిలు.. భయాందోళనలతో కాలనీ వాసులు

  • అర్ధరాత్రి అరుగులు, రోడ్లపై తిష్ట వేసి మద్యం, గంజాయి సేవిస్తున్న వైనం…
  • అడిగితే తాగిన మైకంలో దాడిచేస్తున్న తిరుగుబోతులు

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: దైనందిన జీవితంలో ఉద్యోగం ఉపాధి కోసం పనిచేసి రాత్రి కునుకు తీయాలంటే రోడ్లపై ఆకతాయిలా ఆగడాలు, పెద్దపెద్ద కేకలతో నిద్ర భంగం కలుగడమేకాక, భయాందోళనలతో బ్రతకాల్సి వస్తుందని బస్తీ వాసులు వాపోతున్నారు. జగద్గిరిగుట్ట ప్రాంతంలోని సంజయ్ పురి కాలనీ లో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించిపోతున్నాయి. అత్యవసరంగా మెడికల్ షాప్ కు వెళ్లాలన్న భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాత్రి పదకొండు దాటితే గుంపులు గుంపులుగా మద్యం సేవించేవారు కొందరైతే మరికొందరు గుప్పు గుప్పు మంటూ గంజాయి మత్తులో తూగుతూ రోడ్డుపై రాకపోకలు కొనసాగించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా నవోదయ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట పోలీసులకు ఇక్కడ జరుగుతున్న తంతును వారు వినతి పత్రం ద్వారా ఇచ్చారు. తాము ఇలాంటి ఆకతాయిల వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఎక్కడెక్కడో నుండి గుర్తు తెలియని వ్యక్తులు కొందరైతే… మరికొందరు స్థానిక ఆకతాయి యువకులు వారితో కలిసి అర్ధరాత్రి మద్యం మత్తులో హంగామా సృష్టిస్తున్నారని వెల్ఫేర్ సభ్యులు పోలీసులకు పేర్కొన్నారు. వీరిని కట్టడి చేయకపోతే మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని వారి వివరించారు. తాము నవోదయ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా తమ ప్రాంతాన్ని నేర రహిత ప్రాంతంగా ఉండేందుకు తమ వంతు కృషి తాము చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువతను కూడా సన్మార్గంలో ఉండేటట్లు తల్లిదండ్రులు, కాలనీ పెద్దలతో తాము రానున్న రోజుల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపారు. తమ బస్తీల్లో అర్ధరాత్రులు ఆకతాయిల వలన ఇక్కడ ఉన్న వందల కుటుంబాలకు ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జగద్గిరిగుట్ట పోలీసులు నవోదయ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి. ఇకపై ఆకతాయిలు ఆగడాలను అరికట్టేలా గస్తీ పెంచుతామన్నారు. అంతేకాకుండా అర్ధరాత్రులు ఎవరైనా రోడ్లపై పని బాట లేకుండా కనిపిస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img