– ఏకకాలంలో 60 చోట్ల రెయిడ్స్
– హైదరాబాద్ సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 60 చోట్ల ఏకకాలంలో రెయిడ్స్ జరుగుతున్నాయి. పౌరహక్కుల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో భవాని, న్యాయవాది సురేశ్ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్‌పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కావలి బాలయ్య ఇంటిలో సోదాలు జరుగుతున్నాయి. గతంలో బాంబు పేలుళ్ల కేసులో బాలయ్య కుమార్తె పద్మ, అల్లుడు శేఖర్ నిందితులుగా ఉన్నారు.
గుంటూరు జిల్లా కొండపాటూరులో తమలపాకుల సుబ్బారావు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు, సంతమాగులూరులో ఓరు శ్రీనివాసరావు, రాజమహేంద్రవరంలోని బొమ్మేరులో పౌర హక్కుల నేత నాజర్, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి కోనాల లాజర్, శ్రీకాకుళంలో మిస్కా కృష్ణయ్య ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. కృష్ణయ్య ఆమదాలవలస మండలం తోటవాడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అనంతపురంలో ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంట్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.