HomeజాతీయంHuge earthquake in Morocco: మొరాకోలో భారీ భూకంపం.. 820మందికి పైగా మృతి

Huge earthquake in Morocco: మొరాకోలో భారీ భూకంపం.. 820మందికి పైగా మృతి

– అర్ధరాత్రి భవనాలు కదిలిపోవడంతో పరుగులు తీసిన జనం
– మర్రాకేశ్​ నగరానికి నైరుతి దిశగా భూకంప కేంద్రం
– రిక్టర్ స్కేల్​పై 6.8గా తీవ్రత.. వణికిన నగరాలు
– గాయపడ్డ వారితో నిండిపోయిన ఆస్పత్రులు
– కొనసాగుతున్న సహాయక చర్యలు

Huge earthquake in Morocco: ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఆఫ్రికా దేశమైన మొరాకో భూకంపం ధాటికి వణికిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేల్​పై 6.8గా భూకంప తీవ్రత నమోదైంది. మొరాకో ప్రభుత్వం వెల్లడించిన రిపోర్టు ప్రకారం శనివారం సాయంత్రం నాటికి ఈ ఘటనలో మృతుల సంఖ్య 820 మందికి చేరింది. అల్‌ హౌజ్‌, మర్రాకేశ్‌, క్వార్జాజేట్‌, అజిలాల్‌ సహా పలు ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించాయి. మరో 300 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. ‘అకస్మాత్తుగా భూమి కంపించడంతో భవనాలు కదిలిపోవడం కనిపించింది. దాంతో ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. అప్పుడే సరిగ్గా విద్యుత్తు నిలిచిపోయింది. పది నిమిషాల పాటు మేం అంధకారంలో ఉండిపోయాం. ఏ నెట్‌వర్క్‌ పనిచేయలేదు’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు నిండిపోయాయి. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని చూడలేదని యునైటెడ్ స్టేట్స్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మర్రాకేశ్‌ నగరానికి నైరుతి దిశగా 71 కిలోమీటర్లు దూరంలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. భూకంప కేంద్రం భూమి కింద 18.5 కి.మీ లోతులో ఉన్నట్లు పేర్కొంది.ఈ విపత్తు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. మర్రాకేశ్ నగరంలో పలు ఇండ్లు కూలిపోయాయి.

గాల్లోకి ఎగిరినట్లు అనిపించింది
‘భూమి కంపిస్తోన్న సమయంలో నేను నిద్రలో ఉన్నాను. నాకు గాల్లోకి ఎగిరిపోయినట్లు అనిపించింది. దాంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకుపరిగెత్తాను. నది ఒక్కసారిగా కట్టలు తెంచుకొని ప్రవహించినట్లుగా అనిపించింది. మా ప్రాంతమంతా ఏడుపులు, కేకలతో నిండిపోయింది’ అని మర్రాకేశ్‌ స్థానికులు వాపోయారు. దాంతో ప్రభావిత ప్రాంత ప్రజలంతా రాత్రి ఆరుబయటే ఉండిపోయారు.

గతంలో ఎన్నడూ చూడని విపత్తు
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి. దేశం గతంలో ఎన్నడూ ఈస్థాయి భూకంపాన్ని చూడలేదని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న అల్జీరియాలో కనిపించింది. అయితే, అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. 1980లో అల్జీరియాలో 7.3 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. ఆ దుర్ఘటనలో 2500 మంది మరణించగా.. 3 లక్షల మంది నిరాశ్రయలుగా మారారు. ఈ ఏడాది తుర్కియే ప్రకృతి ప్రకోపానికి గురైన సంగతి తెలిసిందే. దాంతో వేలల్లో మరణాలు సంభవించాయి.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
మొరాకోలో భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ భూకంపం వల్ల వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసిపనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మొరాకోకు సమష్టిగా సాయం చేయాలని జీ20 ప్రారంభోపన్యాసంలో కూడా మోదీ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img