Homeఅంతర్జాతీయంHunger in Afghanistan : అఫ్గానిస్తాన్‌లో చిన్నారుల‌ ఆకలి ఆక్రంద‌న‌

Hunger in Afghanistan : అఫ్గానిస్తాన్‌లో చిన్నారుల‌ ఆకలి ఆక్రంద‌న‌

Hunger in Afghanistan : అఫ్గానిస్తాన్‌లో చిన్నారుల‌ ఆకలి ఆక్రంద‌న‌..

Hunger in Afghanistan – అఫ్గానిస్తాన్ ఆస్పత్రులు మానవ సంక్షోభాన్ని తలపిస్తున్నాయి.

చాలా మంది డాక్టర్లు జీతాలు లేకుండానే పని చేస్తున్నారు.

దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న మానవ సంక్షోభం గురించి కొందరు డాక్టర్లు బీబీసీతో మాట్లాడారు.

ఈ కథనంలో డాక్టర్ల పేర్లను మార్చాం.

ఆమెకు మరి కొంత సేపట్లో సిజేరియన్ ఆపరేషన్ జరగాల్సి ఉంది.

కానీ, తనతో పాటు బిడ్డను కూడా చంపేయమని ఆమె డాక్టర్‌ను ప్రాధేయపడుతోంది.

ఈ విషయాన్ని సెంట్రల్ అఫ్గానిస్తాన్ కు చెందిన డాక్టర్ నూరీ చెప్పారు.

“నేను బతుకుతానో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను మరొకరికి జన్మనెలా ఇవ్వగలను?” అని ఆమె అన్నారు.

డాక్టర్ నూరి పని చేస్తున్న వార్డులో ఉన్న మహిళలందరూ పోషకాహార లోపంతో బలహీనంగా ఉన్నారు.

వారు పిల్లలకు జన్మనిస్తే బిడ్డకు సరిపడే పాలు కూడా వారి దగ్గర ఉండవని వారికి తెలుసు.

వార్డులన్నీ కిక్కిరిసి ఉన్నట్లు డాక్టర్ నూరి చెప్పారు. దాంతో ప్రసూతి వార్డులో మహిళలు రక్తం నిండిన గోడలకు ఆనుకుని , మాసిపోయిన దుప్పట్ల మీద పడుకుని ఉన్నారు.

ఆసుపత్రి శుభ్రం చేసే సిబ్బందికి జీతాలు లేకపోవడంతో శానిటేషన్ సిబ్బంది ఎవరూ విధులకు హాజరు కావడం లేదు.

ఆసుపత్రిలో చోటు లేకఒక్కొక్కసారి ఒకే బెడ్ మీద కూడా చాలా మంది మహిళలు ఉంటున్నారు.

దగ్గర్లో ఉన్న వైద్య కేంద్రాలు, ప్రైవేటు క్లినిక్‌లు కూడా మూసేసారు.

సెంట్రల్ అఫ్గానిస్తాన్‌లో ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిలో సాధారణంగా ఉండే రోగుల కంటే మూడు రెట్లు ఎక్కువ మంది రోగులు ఉన్నారు.

“ఏ ఆస్పత్రిలోనైనా ప్రసూతి వార్డులు సంతోషంతో నిండి ఉంటాయి. కానీ, అఫ్గానిస్తాన్‌లో ఆ పరిస్థితి కనిపించటం లేదు” అని డాక్టర్ నూరీ అన్నారు.

సెప్టెంబరులో కేవలం రెండు వారాల్లో కొత్తగా పుట్టిన ఐదుగురు శిశువులు ఆకలి బాధతో మరణించడం చూశానని నూరీ చెప్పారు.

ఇక్కడ నరకంలా ఉంది (Hunger in Afghanistan)

అఫ్గానిస్తాన్ ఇప్పటికే కరువుతో అలమటిస్తోంది. కొన్ని దశాబ్ధాల పాటు పోరాటంలో మునిగింది.

తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ ఆర్ధిక పరిస్థితి క్షీణ దశకు చేరుకుంటోంది.

అంతర్జాతీయ సహాయం కూడా తగ్గడంతో దేశ వైద్య ,ఆర్ధిక వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది.

మహిళకు, బాలికలకు ప్రాథమిక హక్కులు కల్పించని ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం పట్ల పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

తాలిబాన్ల నియమాలను ఉల్లఘించినవారికి షరియా చట్టం కింద తీవ్రమైన శిక్షలు విధిస్తారు.

తాజా ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం దేశంలో తీవ్రమైన ఆకలి సంక్షోభం నెలకొంది.

ఈ శీతాకాలంలో కనీసం 1.4 లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడతారని అంచనా వేశారు.

దేశవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న వారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రులన్నీ మూతపడేలా ఉన్నాయి.

ఇప్పటికే సుమారు 2300 ఆరోగ్య కేంద్రాలు మూసేశారు.

కనీసం ప్రాధమిక ఔషధాలు కూడా అందించలేకపోతున్నట్లు మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న డాక్టర్లు చెబుతున్నారు.

చికిత్స కోసం 12 గంటల పాటు నడిచి ఆసుపత్రికి వచ్చిన రోగికి కనీసం పారాసెటమాల్ కూడా ఇవ్వలేకపోతున్నట్లు చెప్పారు.

కాబుల్‌లో ప్రముఖ పిల్లల ఆసుపత్రిలో పోషకాహార లోపం కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 150 % రోగులు ఉన్నారు.

సెప్టెంబరులో ఆసుపత్రిలో మరణాలు పెరిగినట్లు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సిద్ధిఖీ చెప్పారు. ఆస్పత్రికి రావల్సిన నిధులకు కోతలు పడ్డాయి.

10 సంవత్సరాల లోపు నలుగురు పిల్లలు ప్రతీ వారం పోషకాహార లోపం లేదా సంబంధిత రోగాలతో మరణిస్తున్నారు.

ఈ సంక్షోభానికి ఎక్కువగా చిన్న పిల్లలు బలవుతున్నారని ఆయన అన్నారు.

“చాలా మంది పిల్లలు ఆసుపత్రిలో చేరడానికి ముందే చనిపోతున్నారు. అలా చాలా మందికి చికిత్స కూడా అందించలేకపోతున్నాం” అని ఆయన చెప్పారు.

ఆసుపత్రి వరకూ వచ్చేవారికి సహాయం చేసేందుకు కూడా వనరులు చాలా తక్కువగా ఉన్నాయి.

ఆసుపత్రిలో తీవ్రమైన ఆహార, ఔషధ కొరత నెలకొని ఉంది.

రోగులను వెచ్చగా ఉంచేందుకు కూడా చాలా కష్టపడాల్సి వస్తోంది. సెంట్రల్ హీటింగ్ కు సరిపడే ఇంధనం లేదు.

దాంతో, చెట్ల కొమ్మలను నరికి మంట పెట్టి చలి కాచుకునేందుకు సిద్ధం చేయమని సిబ్బందికి సూచిస్తున్నారు.

“ఒక్కసారి కలప అయిపోగానే, తర్వాత ఏమి చేయాలనే ఆందోళన మొదలవుతోంది” అని ఆయన అన్నారు.

డాక్టర్ నూరీ పని చేస్తున్న మెటర్నిటీ వార్డులో తరచుగా కరెంటు పోతోంది.

దీని వల్ల నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను పెట్టిన ఇంక్యుబేటర్లు పాడవ్వడంతో చాలా మంది మరణించినట్లు ఆమె చెప్పారు.

“మా కళ్ళ ముందే వారు ప్రాణాలు కోల్పోవడం చూడటం చాలా విచారకరంగా ఉంది” అని అన్నారు.

ఆసుపత్రిలో ఆపరేషన్లు జరుగుతుండగా కరెంటు పోయినా అది ప్రమాదానికి దారి తీస్తోందని అన్నారు.

“నిన్న మేము ఆసుపత్రి థియేటర్‌లో ఉండగా కరెంటు పోయింది. దాంతో, మొత్తం వ్యవస్థ ఆగిపోయింది.

నేను బయటకు పరుగుపెట్టి సహాయం అడిగాను. ఎవరో కారులో ఉన్న ఇంధనాన్ని తీసి మాకిచ్చారు. దాంతో, మేము జెనెరేటర్‌ను వాడగలిగాం”.

ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగిన ప్రతీ సారి, “నేను అందరినీ తొందర పెడుతూ ఉంటాను. అది చాలా ఒత్తిడితో కూడుకున్న పని” అని అన్నారు.

Hunger in Afghanistan

ఇలాంటి సవాళ్లతో కూడిన వాతావరణంలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి కూడా ఇంకా జీతాలు చెల్లించలేదు.

తాలిబాన్ల ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక లేఖను కోవిడ్ రోగులకు చికిత్స చేసే హెరాత్ లోని ఒక ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రహ్మాని బీబీసీ తో షేర్ చేశారు.

ఈ లేఖను అక్టోబరు 30న విడుదల చేశారు. నిధులు సమకూరేవరకూ సిబ్బందిని జీతాలు లేకుండా పనిని కొనసాగించమని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆ నిధులు అందని పక్షంలో ఆసుపత్రిని మూసేయవలసి వస్తుందని డాక్టర్ రహ్మాని చెప్పారు.

రోగులు స్ట్రెచర్ ల పై నుంచి రోగులను హాస్పిటల్ బయటకు పంపిస్తున్న ఫోటోలు కనిపిస్తున్నాయి. వారి పరిస్థితి ఏమవుతుందో తెలియదు.

మాదక ద్రవ్యాలను సేవించే వారికి చికిత్స అందించే మరో హాస్పిటల్ కూడా రోగులకు చికిత్స అందించేందుకు ఇబ్బంది పడుతోంది.

వారికున్న గంజాయి, హెరాయిన్ లాంటి మత్తుపదార్ధాలను సేవించే వ్యసనాలను మాన్పించేందుకు ఇక వారి దగ్గర ఔషధ నిల్వలు లేవు.

“రోగులను గొలుసులతో మంచాలకు వేసి కట్టేస్తున్నారు. లేదా చేతులకు సంకెళ్లు వేసి బంధించి ఉంచుతున్నారు.

వాళ్ళని చూసుకోవడం చాలా కష్టంగా ఉంది” అని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ నౌరూజ్ చెప్పారు.

సరైన చికిత్స లేకుండా, మా ఆసుపత్రి కూడా రోగులకు జైలులాగే ఉంది” అని అన్నారు.

సిబ్బంది తగ్గిపోవడంతో ఈ ఆస్పత్రి కూడా మూతపడేందుకు సిద్ధంగా ఉంది.

ఇది మూతపడితే, రానున్న శీతాకాలంలో రోగుల పరిస్థితి ఏమిటని డాక్టర్ నౌరూజ్ ఆందోళన చెందుతున్నారు.

“వారికి ఆశ్రయం లేదు. వాళ్లంతా బ్రిడ్జి ల కింద, పాడుపడిన ప్రదేశాల్లో, స్మశానాల్లో తల దాచుకుంటారు.

అక్కడ జీవించడం దుర్లభంగా ఉంటుంది” అని అన్నారు.

సహాయ నిధులను పునరుద్ధరణను అమలు చేసేందుకు తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేస్తున్నట్లు తాలిబాన్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కలందర్ ఇబాద్ బీబీసీ పర్షియాకు నవంబరులో చెప్పారు.

కానీ, తాలిబాన్లకు ప్రధానంగా సహాయం అందించే దాతలు తాలిబాన్లను పక్కన పెట్టాలని చూస్తున్నాయి. నిధుల వినియోగం పట్ల కొన్ని దేశాలకు అనుమానాలున్నాయి.

ఐక్యరాజ్య సమితి నవంబరు 10న ఆ దేశ వైద్య వ్యవస్థకు నేరుగా అందేలా 15 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందచేసింది.

అందులో 8 మిలియన్ డాలర్లను సుమారు 23,500 మంది వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ఉపయోగించారు.

ప్రస్తుతానికి ఇది చాలా తక్కువ మొత్తమే అయినప్పటికీ, ఇతర దేశాలు ఐక్యరాజ్య సమితిని అనుసరిస్తాయని ఆశిస్తున్నారు.

కానీ, సమయం మించిపోతోంది.

Hunger in Afghanistan

“తొందర్లోనే మాకు నీటి కొరత కూడా ఏర్పడవచ్చు” అని డాక్టర్ నూరీ చెప్పారు.

మరో పక్క ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో రోగులు చలిని తట్టుకోలేకపోతున్నారు.

కఠిన మైన వాతావరణ పరిస్థితులు పాకిస్తాన్, ఇండియా లాంటి దేశాల నుంచి జరిగే సరుకుల రవాణాకు కూడా ఆటంకంగా నిలుస్తాయి.

“ఈ మహిళలు తమ పిల్లలతో కలిసి ఆసుపత్రి వదిలి బయటకు వెళ్లిన ప్రతి సారీ ఆలోచిస్తూ ఉంటాను.

వాళ్ళ దగ్గర డబ్బు లేదు. వాళ్ళు తిండిని కొనుక్కునేందుకు డబ్బులుండవు” అని చెప్పారు.

నిత్యావసరాల కోసం ఆమె కుటుంబం కూడా చాలా కష్టపడాల్సి వస్తోంది.

“ఒక డాక్టర్ నైన నాకే తినేందుకు సరైన ఆహారం లేదు. నేనిక ఖర్చు పెట్టే స్థితిలో లేను. నా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి” అని అన్నారు.

“రోజూ పనిలోకి ఎందుకు వస్తున్నానో నాకే తెలియదు. ప్రతీ రోజూ నాకు నేనే ఈ ప్రశ్నను వేసుకుంటాను.

నాకింకా భవిష్యత్తు బాగుంటుందనే ఆశ ఉండి ఉంటుంది”.

Recent

- Advertisment -spot_img