HomeతెలంగాణHusnabad:హుస్నాబాద్​ టికెట్​ ఎవరికి?

Husnabad:హుస్నాబాద్​ టికెట్​ ఎవరికి?

– కాంగ్రెస్​లో వర్గపోరు స్టార్ట్​
– పొన్నం, ప్రవీణ్​ రెడ్డి మధ్య తీవ్ర పోటీ?
– పొన్నంవైపే సీనియర్ల మొగ్గు?
– అలిగిన ప్రవీణ్​ రెడ్డి
– సీపీఐకి కేటాయించే చాన్స్​?
– రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలు

ఇదే నిజం, భీమదేవరపల్లి: హుస్నాబాద్​ కాంగ్రెస్​ టికెట్​పై తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ టికెట్​ ను సీనియర్​ కాంగ్రెస్​ నేత పొన్నం ప్రభాకర్​ ఆశిస్తున్నారు. మరోవైపు మరో నేత అలిగిరెడ్డి ప్రవీణ్​ రెడ్డి సైతం ఈ టికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే అలిగిరెడ్డి సెగ్మెంట్ వ్యాప్తంగా పర్యటించారు కూడా.. కాంగ్రెస్​ అధిష్ఠానం పొన్నం వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మరోవైపు సీపీఐకి ఈ సీటు కేటాయించే యోచన కూడా చేస్తున్నది. దీంతో ప్రస్తుతం హుస్నాబాద్​ లో కాంగ్రెస్ రాజకీయం హీటెక్కింది. పొన్నంకు టికెట్​ కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగడంతో ప్రవీణ్​ అలిగారని తెలుస్తోంది. ‘గడప గడపకు ప్రవీణ్ అన్న’ అనే పేరుతో గత కొన్ని రోజులుగా నియోజవర్గం లో పర్యటిస్తున్న తనను కాదని పొన్నంకు ఎలా కేటాయిస్తారని అలిగి రెడ్డి అధిష్టానంపై అలిగినట్లు సమాచారం. హుస్నాబాద్ కాంగ్రెస్ బరిలో పొన్నం ప్రభాకర్ గౌడ్ పోటీ చేయాలని గతంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు సైతం కోరినట్లు సమాచారం. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయిస్తామని ప్రకటించడం కూడా పొన్నం రాకకు మార్గం సుగమం అయిందని తెలుస్తోంది. ఈ నియోజవకర్గంలో ప్రవీణ్​ రెడ్డి పాత్ర ఎంతో కీలకం. పొన్నం ప్రభాకర్​ కు టికెట్​ ఇస్తే ప్రవీణ్​ రెడ్డి సపోర్ట్ చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నర్థకమే.

పొత్తు కుదిరితే సీటు సీపీఐకే..?
కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు కుదిరితే పొన్నంతో పాటు అందరి ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. బీఆర్ఎస్​తో పొత్తు బెడిసి కొట్టడంతో కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ సంప్రదింపుల్లో బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం స్థానాలను వామపక్షాలు కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లాయి. వీరి మధ్య చర్చలు సఫలం అయితే హుస్నాబాద్ సీటును సీపీఐకి కేటాయించడం ఖాయం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కారణంగా సీపీఐ అభ్యర్థిగా హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి పోటీ చేయడంతో మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరాడు. ఇటీవల మళ్లీ ఆయన సొంత గుడికి చేరుకొని హుస్నాబాద్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పొన్నం ప్రభాకర్ మాత్రం హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ కచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా కమ్యూనిస్టుల పొత్తు అంశంతో హుస్నాబాద్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

బీసీలే అత్యధికం..
హుస్నాబాద్ నియోజవర్గంలో బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్, అక్కన్నపేట్, చిగురుమామిడి, కోహెడ, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి 7 మండలాలు ఉన్నాయి. నియోజవర్గంలో మొత్తం 2,30,902 ఓటర్లలో పురుషులు 1,14,868, మహిళలు 1,16,032 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో దాదాపు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న బీసీ ఓటర్లలో గౌడ్​లే అధికం. తర్వాత స్థానంలో ముదిరాజ్, పద్మశాలి, మున్నూరు కాపు ఓటర్లు ఉన్నారు. కాగా గౌడ్​ సామాజిక వర్గానికి చెందిన దేశిని చిన్న మల్లయ్య నాలుగు సార్లు ఇక్కడి నుండే గెలుపొందారు. బీసీ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండడంతో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గంలో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి కూడా ఎంతో పట్టు ఉంది. ఒకవేళ పొన్నం ప్రభాకర్​ కు టికెట్​ ఇస్తే.. ప్రవీణ్​ రెడ్డి సపోర్ట్ చేస్తారా? లేదా? అన్న చర్చకూడా సాగుతోంది. మరోవైపు ఇక్కడ సీపీఐకి టికెట్​ కేటాయిస్తే కాంగ్రెస్​ నేతలు సపోర్ట్ చేసే అవకాశం లేదు. దీంతో బీఆర్‌‌ఎస్​ కే లాభం చేకూరే అవకాశం ఉంది. మరి అంతిమంగా కాంగ్రెస్​ పార్టీ ఎవరికి టికెట్​ ఇస్తుంది? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img