Hyderabad: ఖమ్మం సభలో రాహుల్ వ్యాఖ్యలు చూస్తే ఆయన పప్పే అనేది నిజమని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని విమర్శించారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ రిమోట్ గాంధీగా మారిపోయారని తేలిందన్నారు. రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఉన్నాయా అని నిలదీశారు.
కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రూ.4 వేలు పింఛన్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అవినీతికి అడ్రస్‌గా మారిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే రూ.80 వేల కోట్లతో అని, దీనిలో లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని స్కాములు ఎక్కడా జరుగలేదని, మీరు స్కాములకు రారాజులని విమర్శించారు. రాహుల్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, మాజలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
తామెవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీయే ఏ టీమ్, బీ టీమ్‌గా మారుతున్నారని విమర్శించారు. ఈటల, రేవంత్‌రెడ్డి రహస్య భేటీ నిజం కాదా అని నిలదీశారు. ఎవరు, ఎవరికి బీ టీమో ఇప్పుడు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు అవకాశవాదులని మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 100 స్థానాలు గెలుచుకుంటుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్‌లో చేరినవారంతా ప్రజలు తిరస్కరించినవాళ్లేనని విమర్శించారు.