హైదరాబాద్ మెట్రో విస్తరణ గురించి కీలక అప్డేట్ వచ్చింది. పాతబస్తీ మెట్రో భూసేకరణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం మెట్రో ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన ఆస్తుల యజమానులకు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పాతబస్తీలో రెండో దశ మెట్రో పనుల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. నష్టపోయిన ఆస్తుల యజమానులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. కారిడార్-6లోని ఎంజీబీఎస్ – చాంద్రాయణ గుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉన్నాయని, వాటి యజమానులు పెద్ద సంఖ్యలో తమ భూములను మెట్రో రైలు నిర్మాణానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.మొదటి దశలో 40కి పైగా ఆస్తుల యజమానులకు ఈ నెల 6వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.