– తుపాకీతో కాల్చుకుని సూసైడ్
– హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఘటన
ఇదే నిజం, హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఫజల్ అలీ తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. కుమార్తెతో మాట్లాడిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఫజల్ అలీ బలవన్మరణానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఉదయం 7 గంటల సమయంలో ఫజల్ అలీ ఆత్మహత్యకు పాల్పడినట్లు డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఉదయం కుమార్తెతో కలిసి ఆయన విధులకు వచ్చారని.. వ్యక్తిగత విషయాలపై ఆమెతో చర్చించారని చెప్పారు. ఫజల్ అలీ బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎస్కార్ట్ ఇన్‌చార్జిగా ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఫజల్ అలీ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.